తాగొద్దు.. లొల్లొద్దు!

14 Sep, 2019 09:21 IST|Sakshi

తేదీ ఈ నెల 8.. తార్నాక మెట్రో స్టేషన్‌.. రైలెక్కిన ఓ వ్యక్తి అతిగా మద్యం తాగి హంగామా చేశాడు. సిబ్బంది వెంటనే అతణ్ని రైలులో నుంచి దింపేశారు. ఇక నుంచి ఇలా ఎవరైనా చేస్తే సహించబోమని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. మందుబాబుల న్యూసెన్స్‌పై ఫిర్యాదులు స్వీకరించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నిందితులను అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. పరిమిత మోతాదులో మద్యం తాగి, బుద్ధిగా ఉంటేనే మెట్రో జర్నీకి అనుమతి ఇస్తామన్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: అతిగా మద్యం సేవించి మెట్రో రైళ్లలో న్యూసెన్స్‌ చేసే మందుబాబులకు చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 8న తార్నాక మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి రైలులో తన మొబైల్‌లో పాట పెట్టి విపరీతంగా డ్యాన్స్‌ చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించాడు.  వారు దాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి మెట్రో అధికారులకు చేరవేయడంతో సిబ్బంది అతణ్ని కిందికి దించేశారని తెలిపారు. పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌కు రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధిస్తుండడంతో... చాలామంది తనను వ్యక్తిగతంగా కలిసి పరిమిత మోతాదులో మద్యం తాగిన వారిని మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని కోరారని చెప్పారు.

పలువురు ఎన్‌ఆర్‌ఐలు సైతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మెట్రో రైళ్లలో మద్యం తాగిన వారిని అనుమతిస్తున్నారని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ నేపథ్యంలోనే తాము ఉదారంగా వ్యవహరిస్తూ పరిమిత మోతాదులో మద్యం తాగిన వారిని మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని భద్రతా సిబ్బందికి సూచించామన్నారు. అయితే మందుబాబుల ఆగడాలు ఎక్కువవుతుండడంతో వారిని కట్టడి చేసేందుకు త్వరలో ప్రత్యేకంగా వాట్సప్‌ నంబర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దీని ఆధారంగా అతిగా మద్యం తాగి మెట్రోరైళ్లు, స్టేషన్లలో అల్లరి చేసే వారిపై తోటి ప్రయాణికులు, మెట్రో సిబ్బంది నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. మందుబాబులను ఎక్కడికక్కడే అరెస్టు చేసి వారిని చట్టప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు