‘వడదెబ్బ'కు అందని సాయం

22 May, 2015 04:44 IST|Sakshi

- అక్కరకు రాని ఆపద్బంధు క్షేత్రస్థాయిలో స్పందించని రెవెన్యూశాఖ మెడికల్, పోలీసు
- రిపోర్టుల్లో జాప్యం మూడు శాఖలు కలిస్తేనే సాయం.
సాక్షి, హన్మకొండ :
జిల్లాలో వడదెబ్బతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద దిక్కును కోల్పోరున కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద ప్రభుత్వం రూ.50 వేలు అందిస్తోంది. ఈ సాయం అందాలంటే రెవెన్యూ, మెడికల్, పోలీసుశాఖలు నివేదికలు ఇవ్వాలి. ఈ మూడు శాఖల మధ్య సమన్వయం లోపిస్తే ఆపద్బంధు ద్వారా అందాల్సిన సాయం మధ్యలో ఆగిపోతుంది. కాగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆపద్బంధు పథకం ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రస్తుతం వడదెబ్బ మృతులకు కూడా ఆపద్బంధు పథకం ద్వారానే సాయం అందిస్తున్నారు. ఈ సాయాన్ని అందించేందుకు మండలం, డివిజన్, జిల్లాస్థాయిల్లో కమిటీలు ఉంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ కమిటీకి సారథ్యం వహిస్తారు. వడదెబ్బ కారణంగా వ్యక్తి చనిపోయినప్పుడు ఆర్థిక సాయం కోసం మరణించిన కుటుంబానికి చెందిన వ్యక్తులు గ్రామ రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేయాలి. ఆయన తహసీల్దార్‌కు సమాచారం ఇస్తారు. అనంతరం తహశీల్దార్, పోలీసులు, మెడికల్ ఆఫీసర్లు విచారణ చేపడతారు. ఈ విచారణలో వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లుగా ధ్రువీకరిస్తే ఆపద్బంధు పథకం ధ్వారా రూ 50,000 సాయం అందుతుంది.

సాయంలో జాప్యం
ఆపద్బంధు సాయం పొందడంలో మెడికల్ రిపోర్టుది కీలక పాత్ర. మెడికల్ ఆఫీసర్ ఇచ్చే  రిపోర్టులో వడదెబ్బ అని తేలితేనే సాయమందిస్తామని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్నారు. దీనితో ఎక్కువ మరణాలు సాధారణ మరణాలుగానే పరిగణిస్తూ సాయం చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. గ్రామస్థాయిలో వడదెబ్బ కారణంగా మరణాలు సంభవించినప్పుడు రెవెన్యూ, పోలీసు, ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరణం సంభవించినప్పుడు గ్రామస్థాయిలో ఉండే వీఆర్‌వోలు తహశీల్దార్‌కు సమాచారం ఇవ్వగానే.. పోలీసులు, మెడికల్ ఆఫీసర్లు వెంటనే శవపరీక్ష నిర్వహించడం వల్ల కచ్చితమైన రిపోర్టు వచ్చేందుకు అవకాశం ఉంది. మరణం సంభవించినప్పుడు గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అంత్యక్రియలు పూర్తవుతున్నాయి. ఆ తర్వాత నివేదిక ఇచ్చే సమయంలో వడదెబ్బ కారణంగానే మరణించారు అని నిర్ధారించడం కష్టంగా మారుతోంది. దీనితో అనేక పేద కుటుంబాలకు సాయం అందడం లేదు.

పూట గడవడం కష్టమే
మరిపెడకు చెందిన కర్నాటి సత్యనారాయణ(65) స్థానిక పంచాయతీ పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం విధులకు వెళ్లిన సత్యనారాయణ వడదెబ్బకు గురయ్యారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఇంట్లోనే చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈయన మరణంతో భార్య, పెద్దకూతురు ది క్కులేనివారయ్యారు. సెంట్‌భూమి కూడా లేని దుర్భర పరిస్థితి. అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్పంచ్ సాయం చేశారు. ఆపద్బంధు పథకం ద్వారా తమను ఆదుకోవాలని ఈ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోలీసులు, తహశీల్దార్, మెడికల్ ఆఫీసర్లు ఇచ్చే రిపోర్టుపైనే ఈ కుటుంబానికి సాయం అందనుంది.

మరిన్ని వార్తలు