సాగు భళా..రుణం డీలా? 

25 Sep, 2019 07:51 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి ఈ సారి పంటలు సాగయ్యాయి. ప్రధానంగా పత్తి, సోయాబీన్‌ పంటలను రైతులు అధికంగా సాగు చేశారు. కొద్దిగా కందులు, మినుములు, శనగ వేశారు. అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణాన్ని మించి సాగైన ఆనందం రైతుల్లో ఉన్నా బ్యాంకు రుణాల విషయంలో మాత్రం ఆవేదన చెందుతున్నారు. 

ఇదీ పరిస్థితి..
జిల్లాలో గతేడాది పంట రుణ లక్ష్యంలో 76.82 శాతం సాధించారు. అయితే జిల్లాలో ప్రధానంగా ఖరీఫ్‌ పంటలే రైతులకు జీవనాధారం. రబీలో అతితక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ పం టలకే రైతులకు రుణాలిస్తే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ప్రసు ్తతం ఖరీఫ్‌ దాటిపోయినా రుణ లక్ష్యం లో దారుణంగా బ్యాంకర్లు వెనుకబడిపోయారు. అయితే తాము రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రైతులే రుణాలను రీషెడ్యూల్‌ చేసుకోవడంలో వెనుకబడిపోతున్నారని బ్యాంకర్లు  చెబుతున్నారు.

బ్యాంక్‌కు వెళితే పాత బకాయిలు కడితేనే కొత్త రుణం ఇచ్చేదని బ్యాంక ర్లు తమ నిబంధనలు వల్లే వేస్తున్నారు. మరో పక్క ఎన్నికలకు ముందు రూ.లక్ష వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం మెనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో పలువురు రైతుల్లో ఆ రుణం కడితే మాఫీ వర్తిస్తుందో.. లేదోనన్న అయోమయంలో అసలు దాని జోలికే పోవడంలేదు. ఈ పరిస్థితిలో ఈసారి రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు విఫలమయ్యాయి. పాత బకాయిలు కట్టినా రుణమాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లు చెబుతున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడంలేదు.

దీంతో జిల్లాలో రుణ లక్ష్యం కొండంత కనిపిస్తుండగా గోరంత పంపిణీ చేసినట్టు లెక్కలు కనబడుతున్నాయి. కాగా ఒక రైతు బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు దాన్ని నిర్ణీత వ్యవధిలో కట్టినప్పుడు రుణం రీషెడ్యూల్‌ చేస్తారు. నిర్ణీత వ్యవధిలో కట్టిన రైతులకు దానిపై 7శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒకవేళ వ్యవధి దాటితే వడ్డీ శాతం పెరుగుతుంది. అన్నదాతలు ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందనే నమ్మకంతో పాత బకాయిలను చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతోనే బ్యాంక ర్లు రుణాలు రీషెడ్యూల్‌ చేయలేకపోయామని పేర్కొంటున్నారు. ఏదేమైనా జిల్లాలో ఈఏడాది పంట రుణ లక్ష్యంలో పూర్తిగా వెనుకబడిపోయింది.

సాధారణంగా రైతులు సాగు సమయంలో పంట రు ణం కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు పాత బకాయిలను పట్టుకొని కొత్త రుణం ఇవ్వడం చేస్తారు. ఈ పద్ధతిని బుక్‌అడ్జెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు.. రైతు లక్ష రూపాయల రుణ బకాయి ఉంటే కొత్తగా కొంతమొత్తం పెంచి లక్షన్నర రుణం ఇస్తున్నట్లు బుక్‌లో పేర్కొన్నా లక్షన్నరలో రూ.50వేలు రైతు చేతిలో పెట్టి పాత బకాయి కింద లక్ష  చేతిలో పెడతారు. దీన్నే బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌గా పరి గణిస్తారు. ఇది ఆనవాయితీగా బ్యాంకర్లు, రైతుల మధ్య కొనసాగుతున్న ఒక అనధికారిక ఒప్పందంగా చెప్పవచ్చు.

ప్రైవేట్‌ అప్పుల వైపు..
రుణాలు రీషెడ్యూల్‌ కాకపోవడంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితిలో ప్రైవేట్‌ అప్పులు చేస్తున్నారు. జిల్లాలో పంట కాలానికి రైతులకు అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారులు అధికంగా ఉన్నారు. పంట కాలాన్ని పరిగణలోకి తీసుకొని 20 నుంచి 25శాతం వడ్డీతో వ్యాపారులు రైతులకు అప్పులు ఇస్తున్నారు. రుణం రీషెడ్యూల్‌ చేసుకోలేని రైతులు ప్రైవేటు అప్పులతో కుదేలవుతున్నారు. జిల్లాలో లక్షకుపైగా రైతుల అకౌంట్లు ఉంటే, 40శాతం అకౌంట్లకు కూడా రుణాలు లభించలేదు.  

జిల్లాలో పంటల సాగు
సాధారణ సాగు : 1,93,072 హెక్టార్లు
సాగైన విస్తీర్ణం : 1,94,110 హెక్టార్లు (101శాతం)

2019–20 (ఖరీఫ్‌+రబీ)రూ.1576.53 కోట్లు
రుణ లక్ష్యం..
ఖరీఫ్‌లో ఇచ్చింది : రూ.348.94 కోట్లు (22శాతం)
రుణం పొందిన రైతులు : 34,833 కోట్లు 

2018–19లో రూ.1473.93 కోట్లు
గతేడాది రుణ లక్ష్యం (ఖరీఫ్‌+రబీలో)  ఇచ్చింది : రూ.1128.43 కోట్లు
రుణం పొందిన రైతులు : 1,11,343  

>
మరిన్ని వార్తలు