‘ఉక్కు’.. ఏ దిక్కు? 

30 Mar, 2018 07:19 IST|Sakshi
పాల్వంచలో మూతపడిన ఎన్‌ఎండీసీ స్పాంజ్‌ ఐరన్‌ కర్మాగారం

బయ్యారం నుంచి పాల్వంచకు మారిన కథ !

ఇక్కడా భూõసేకరణ చేయాల్సిందే..

ప్రస్తుతం ఉన్నది 425 ఎకరాలే.. అవసరం 1000 ఎకరాలు

కేంద్రం ‘డిజిన్వెస్ట్‌మెంట్‌’ నేపథ్యంలో సాధ్యమేనా..?

సాక్షి, కొత్తగూడెం : బయ్యారంలో ఉక్కు కర్మాగారం.. 2012 నుంచి దీనిపై రకరకాల చర్చలు, ఆందోళనలు జరుగుతున్నాయి. చివరకు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల కాలంలో దీనిపై వివిధ కదలికలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక స్పష్టమైన ప్రకటన మాత్రం రాకపోవడంతో అన్ని వర్గాల ప్రజల్లో అనేక సందేహాలు వస్తున్నాయి. ఇన్నాళ్లుగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై ఉత్కంఠ నెలకొనగా.. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది.

బయ్యారం బదులు పాల్వంచలో ఏడాదిన్నర క్రితం మూతపడిన ఎన్‌ఎండీసీలో విలీనం అయిన స్పాంజ్‌ ఐరన్‌ కర్మాగారాన్ని 1.5 మిలియన్‌ టన్నుల ఉక్కు కర్మాగారంగా కేంద్ర ప్రభుత్వం మార్చనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే అనేక సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాల్వంచలో ఉన్న యూనిట్‌లో 30 వేల టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన రెండు యూ నిట్లు ఉండగా, ఏడాదిన్నర క్రితం ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ 425 ఎకరాల భూమి మాత్రమే అందుబాటులో ఉంది.

అయితే 1.5 మిలియన్‌ టన్నుల సామ ర్థ్యంతో ఉక్కు కర్మాగారం నిర్మించాలంటే కనీసం 1000 ఎకరాల భూమి ఉండాలి. బయ్యారంలో భూసేకరణ సమస్యగా ఉంటుందని, పాల్వంచలో అయితే ఆ అవసరం లేదనీ చెపుతున్నప్పటికీ.. ఇక్కడ కూడా భూమి సేకరించాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు.   

‘మెకాన్‌’ నుంచి డీపీఆర్‌ రాలే.. 
కేంద్ర ప్రభుత్వ కన్సల్టెన్సీ అయిన ‘మెకాన్‌’ (మైనింగ్‌ ఇంజినీర్స్‌ కన్సల్టెన్సీ) సంస్థ ఇప్పటివరకు ఇందుకు సంబంధించి డీపీఆర్‌ ఇవ్వలేదు. అక్కడి నుంచి డీపీఆర్‌ వస్తేనే కేంద్ర గనులు, ఉక్కు, ఆర్థిక శాఖలు కలిసి అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాతే తుది రూపు వస్తుంది. ఈ క్రమంలో బయ్యారం, పాల్వంచల మధ్య ఉక్కు కర్మాగారం అంశం దోబూచులాడుతోంది. అసలే కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ (పెట్టుబడుల ఉపసంహరణ) చేస్తున్న పరిస్థితుల్లో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టే అంశంపైనా సందేహాలు నెలకొన్నాయి. 

నాడు ఆదర్శం.. నేడు అగమ్యగోచరం.. 
పాల్వంచలోని జాతీయ ఖనిజాభివృద్ది సంస్థ(ఎన్‌ఎండిసీ) స్పాంజ్‌ ఐరన్‌ యూనిట్‌ సరికొత్త దేశీయ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుని పలు దేశాలకు ఆదర్శంగా నిలిచింది. స్పాంజ్‌ ఐరన్‌ తయారీలోనే ప్రత్యేకత కలిగి ఉండేది. ఇక్కడ రూపొందించిన టెక్నాలజీని సైతం ఇతర ప్రైవేట్‌ కర్మాగారాలకు విక్రయించింది. లక్ష్యానికి మించిన ఉత్పత్తిని సాధించి తన రికార్డులను తానే తిరగరాసింది. అయితే ముడిసరుకుతో పాటు మార్కెటింగ్‌ సమస్యతో చివరకు మూతపడింది.

పక్కనే ఉన్న ఏపీ స్టీల్స్‌ మూతపడడంతో మార్కెటింగ్‌ కోసం చెన్నై తదితర దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో భారీ లాభాల నుంచి నష్టాల బాటలోకి వచ్చింది. 2010లో స్పాంజ్‌ ఐరన్‌ను విలీనం చేసుకున్న ఎన్‌ఎండీసీ ఏమాత్రం పట్టించుకోకపోగా, ఉన్న ఉద్యోగులకు కూర్చోబెట్టి జీతాలు ఇస్తోంది. గతంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రాంవిలాస్‌పాశ్వాన్‌ రూ.1,200 కోట్లతో విస్తరింపజేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటే అయింది.

మరిన్ని వార్తలు