నో బయోమెట్రిక్‌.. ఓన్లీ హాల్‌టికెట్‌!! 

24 May, 2020 03:39 IST|Sakshi

సెట్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం 

జేఈఈ పరీక్షల్లోనూ బయోమెట్రిక్‌ రద్దు 

సాక్షి, హైదరాబాద్ ‌: ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్‌ తదితర ఉమ్మడి ప్రవే శ పరీక్షల్లో(సెట్స్‌) బయోమెట్రిక్‌ హాజరు విధానం లేకుండానే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి ఇప్పటివరకు సేకరిస్తున్న బయోమెట్రిక్‌ (థంబ్‌ ఇంప్రెషన్‌) విధానాన్ని తొలగించాల ని నిర్ణయించింది. పరీక్షకు వచ్చే విద్యార్థుల్లో ఎవరి కైనా కరోనా ఉంటే థంబ్‌ ఇంప్రెషన్‌(వేలి ముద్రల సేకరణ)తో వైరస్‌ వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నందున ఈసారి థంబ్‌ ఇంప్రెషన్‌ను తొలగించాలని నిర్ణయించింది. విద్యార్థుల హాల్‌టికెట్‌ క్షుణ్ణంగా పరిశీలించనుంది. దీంతో ఒకరికి బదులు మరొక రు పరీక్ష రాసే అవకాశం ఉండదు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌ను రద్దు చేస్తున్నందున హాల్‌టికెట్ల ఆధారంగా విద్యార్థుల పరిశీలనను  జాగ్రత్తగా చేపట్టాలని నిర్ణయించింది. జూలై 1 నుంచి నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్‌ను తొలగించనుంది. జాతీయ స్థాయిలోనూ జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్‌ను తొలగించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే.  

పరీక్ష హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు 
బయోమెట్రిక్‌ వల్ల కరోనా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. జూలై 18 నుంచి 23 వరకు జరిగే జేఈఈ మెయిన్, ఆగస్టులో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ బయోమెట్రిక్‌ లేకుండానే పరీక్షలు నిర్వహించనున్నారు.ఇక జాతీయ స్థాయి పరీక్షల్లో హాల్లో సీసీ కెమెరాలతోపాటు విద్యార్థులు ఆన్‌లైన్‌ పరీక్షలు రాసే సమయంలో విద్యార్థి ఎదురుగా ఉండే మానిటర్‌పై కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ కెమెరాలు ప్రతి ఐదు నిమిషాలకోసారి విద్యార్థి ఫొటోను ఆటోమెటిక్‌గా తీస్తాయి.

మరిన్ని వార్తలు