సీడీలకు బడ్జెట్‌ లేదట!

24 May, 2018 08:07 IST|Sakshi

స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ రికార్డింగ్‌పై నీలినీడలు  

సీసీ కెమెరాల మధ్య రికార్డింగ్‌ ప్రక్రియ 

కొనుగోలుదారుడికి అందని సీడీలు 

సాక్షి,సిటీబ్యూరో : రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్‌ శాఖలో కొత్త సంస్కరణలు ఆచరణలో కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏటా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లతో వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుంటున్నా వినియోగదారులకు మాత్రం మెరుగైన సేవలు అందించడంలో కక్కుర్తిగా వ్యవహరిస్తోంది. అక్రమ దస్తావేజుల నమోదు, అడ్డదారులు, అక్రమ వసూళ్లు, రికార్డుల ట్యాంపరింగ్, తప్పుడు దస్తావేజులు నమోదు వంటి అభియోగాలను మూట కట్టుకున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పుడు సరికొత్త విధానాలకు తూట్లు పొడుస్తోంది. తాజాగా స్థిరాస్తి లావాదేవిల్లో పారదర్శకత కోసం అమల్లోకి తెచ్చిన ‘రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వీడియో రికార్డింగ్‌‘కు సీడీల కొరత ఏర్పడింది. సీడీల కోసం ప్రత్యేక బడ్జెట్‌ లేదంటూ సీసీ కెమెరాల ద్వారా స్థిరాస్తి నమోదు ప్రక్రియను రికార్డు చేసి చేతులు దులుపుకుంటోంది. ఏడాది కాలంగా చిక్కడపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘వీడియో రికార్డింగ్‌’ విధానం విజయవంతం కావడంతో ఇటీవల అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు విస్తరించారు. 

సీసీ కెమెరాల ద్వారా రికార్డింగ్‌..  
పకడ్డందీగా చేయాల్సిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో సీసీ కెమెరా ద్వారా రికార్డింగ్‌ చేస్తున్నారు. కానీ రికార్డింగ్‌ను సీడీలకు మాత్రం క్యాప్చర్‌ చేయడం లేదు. ప్రతి సబ్‌ రిజిస్టార్‌ ఆఫీస్‌కు రెండేసి చొప్పున సీసీ కెమెరాలు సరఫరా జరిగాయి. అందులో ఒకటి కార్యాలయంలోను, మరొకటి స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసం వినియోగించాలి. చిక్కడపల్లి ఎస్‌ఆర్వోలో విజయవంతంగా అమలవుతున్న మాదిరిగా సీసీ కెమెరాల ద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ రికార్డింగ్‌ చేసి, కొనుగోలుదారుడికి  రికార్డింగ్‌ సీసీ కాపీని అందజేయాలని ఇటీవల సాక్షాత్తు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపుల శాఖ ఐజీ, కమిషనర్‌ వాకటి కరుణ ఆజ్ఞలు జారీ చేశారు. సీసీ రికార్డింగ్‌ అమలుపై నివేదిక సమర్పించాలని జిల్లా రిజిస్ట్రార్లకు సూచించారు. కానీ సీడీ జారీ మాత్రం అమలు కావడం లేదు. 

ప్రతి రిజిస్ట్రేషన్‌ రికార్డింగ్‌ ఇలా 
రికార్డింగ్‌ విధానంలో ‘అమ్మకం దారులు ఫలానా భూమిని ఇష్టపూర్వకంగా  అమ్ముతున్నానని, నగదు కూడా తీసుకున్నట్లు’ చెప్పాలి. ఈ విషయాన్ని సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. కొనుగోలు దారులు, సాక్షులు, రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బంది సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయినా తర్వాత రికార్డింగ్‌ను సీడీలోకి మార్చి కొనుగోలుదారుడికి అందజేయాలి. అమ్మకందారుడు కూడా సీడీని తీసుకోవచ్చు. కానీ సీడీలకు బడ్జెట్‌ లేదంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా సీడీల జారీకి కక్కుర్తిగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది.   

మరిన్ని వార్తలు