నజరానాలే.. జరిమానాల్లేవ్‌!

13 May, 2020 13:21 IST|Sakshi
పెద్దపల్లిలో మద్యం విక్రయాలు (ఫైల్‌)

లాక్‌డౌన్‌లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

మద్యం దుకాణదారులతో ఎక్సైజ్‌ శాఖ కుమ్మక్కు

మార్చి 22న మూతపడి ఈ నెల 6న తెరుచుకున్న షాపులు

రెండు, మూడు రెట్లు ధరలు పెంచి అమ్మకాలు

దుకాణాల్లో స్టాక్‌ తగ్గలేదని గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రూ.130 విలువైన క్వార్టర్‌ బాటిల్‌ రూ.400... రూ.600 విలువైన ఫుల్‌బాటిల్‌ ధర ఏకంగా రూ.2,500... రూ.1000 పైన ఎంఆర్‌పీ ఉన్న ప్రీమియం లిక్కర్‌ ధరలు రూ. 4,000 పైనే... మార్చి 22న జనతా కర్ఫ్యూ తరువాత 23 నుంచి నిరవధికంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన తరువాత కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాలు జరిగిన తీరు ఇది. ఈ నెల 5వ తేదీ రాత్రి వరకు ఇదే తంతు సాగగా... 6వ తేదీ నుంచి యధావిధిగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. 5వ తేదీన అన్ని దుకాణాల్లో స్టాక్‌ వివరాలు రాసుకున్న అధికారులు కొన్నింటిలో తప్ప ఎక్కడా అక్రమాలు జరగలేదని పచ్చజెండా ఊపారు. దీంతో లాక్‌డౌన్‌లో అక్రమ పద్ధతుల్లో అమ్మగా మిగిలిన స్టాక్‌ 6వ తేదీ మధ్యాహ్నానికే చాలా చోట్ల అయిపోయింది. లాక్‌డౌన్‌ అక్రమ దందా ఎక్సైజ్, ప్రొహిబిషన్‌ అధికారుల అండతోనే సాగినా.. ఎవరి నజరానాలు వారికి అందడంతో దుకాణదారులు రెట్టించిన ఉత్సాహంతో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. రాజకీయ, అధికార బలం ఉన్న వారి కనుసన్నల్లో నడుస్తున్న దుకాణాల జోలికి వెళ్లేందుకు సాహసించని ఎక్సైజ్‌ అధికారులు అక్కడక్కడా ఒకటీ అరా కేసులు నమోదు చేసి ‘మమ’ అనిపించారు.

మార్చి 24 నుంచే అక్రమ విక్రయాలు
మార్చి 22న జనతా కర్ఫ్యూ కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరుసటి రోజు 23న కూడా కర్ఫ్యూ కొనసాగించారు. 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో మద్యం దుకాణాలు మే 5 వరకు మూతపడే ఉన్నాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని 266 దుకాణాల్లో 200కు పైగా షాపుల్లో “మాల్‌’ మాయమై బెల్ట్‌షాపులు, కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీలు, గోడౌన్‌లు, నివాస గృహాల ద్వారా విక్రయాలు సాగాయి. మార్చి 22న దుకాణాలు మూతపడే సమయానికి షాప్‌లో మద్యం స్టాక్‌ ఎంత ఉందనే విషయాన్ని ఎక్సైజ్‌ అధికారులెవరూ నోట్‌ చేసుకోలేదు. నామ్‌కే వాస్తేగా 24 తరువాత దుకాణాల తాళాలకు సీల్‌ చేసి వెళ్లారే తప్ప ఆ దుకాణాలకు ఎన్ని దారులు ఉన్నాయో కూడా చూసుకోలేదు. సింగిల్‌ ద్వారం ఉన్న దుకాణాల్లోనే స్టాక్‌ మిగిలింది తప్ప, మిగతా చోట్ల దాదాపుగా అయిపోయింది. అధిక ధర గల ప్రీమియం మద్యంతోపాటు సాధారణ మద్యం కూడా దుకాణాల నుంచి మాయమైంది. ఈ నెల 6న దుకాణాలు తెరిచే సమయానికి చాలావాటిలో కొంత మేర చీప్‌ లిక్కర్, కొంత సాధారణ మద్యం మాత్రమే మిగలడం గమనార్హం.

పెద్దపల్లిలో ఆరు షాపులకు జరిమానా..మరో రెండింటి మీద కేసులు
ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులే లిక్కర్‌ కింగ్‌లుగా ఉన్న పెద్దపల్లి జిల్లాలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలైన 45 రోజులు మద్యానికి ఢోకా లేకుండా పోయింది. రాజకీయ అండతో గ్రామాల్లో అప్పటికే ఉన్న బెల్ట్‌షాపులకు తోడు కొత్తగా ఏర్పాటయ్యా యి. చీప్‌ లిక్కర్‌ నుంచి ప్రీమియం, ఫారిన్‌ లిక్కర్‌ వరకు ఏది కావాలంటే అది దొరికింది. ప్రజాప్రతినిధులు, సింగిల్‌ విండో చైర్మన్‌లు, ఇతర రాజకీయ నాయకులు భాగస్వాములుగా ఉన్న దుకాణాల నుంచి రాత్రుల్లో స్టాక్‌ మాయమై తెల్లవారే సరికి ఇళ్లల్లోకి చేరేంది. ఎలిగేడ్‌లో మద్యం దుకాణం తెరిచిన సందర్భంగా 6వ తేదీన గ్రామస్తులు స్టాక్‌ లెక్కలు చూపించాలంటూ ఆందోళన చేశారు. గర్రెపల్లి, సుల్తానాబాద్, పొత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి, ఎన్‌టీపీసీ, గోదావరిఖని, 8 ఇంక్‌లైన్‌ కాలనీ, బసంత్‌నగర్‌ తదితర గ్రామాల్లోని దుకాణాల్లో స్టాక్‌ మాయమైన తీరుపై ఎక్సైజ్‌శాఖకు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. కానీ రాజకీయ అండదండలు ఉండడంతో జరిమానాలకు బదులు నజ రానాలకే ఎక్సైజ్‌ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. అయినా తప్పదన్నట్లు పెద్దపల్లి 3వ దుకాణం, 8ఇంక్‌లైన్‌ దుకాణాలపై రూ.4.50 లక్షల చొప్పున, పెద్దపల్లిలోనే 10వ దుకాణం, బసంత్‌నగర్‌లోని 3 దుకాణాల పైన రూ.2.50లక్షల చొప్పున అపరాధ రుసుము వసూలు చేశారు. కోట్లల్లో మద్యం అక్రమ విక్రయాలు సాగితే 6 దుకాణాల నుంచి  కేవలం రూ.19 లక్షలు మాత్రమే వసూలు చేశారు. గోదావరిఖని, ఎన్‌టీపీసీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు సాగినా ఎలాంటి చర్యలు లేవు.

మిగతా జిల్లాల్లోనూ అదే స్థితి
కరీంనగర్‌లోని ఓ దుకాణం యజమాని ఇంట్లో మద్యం రూ.3లక్షల విలువైన మద్యం దొరికితే 2టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో భద్రపరచగా, ఆ సీసాలను కానిస్టేబుల్, తాత్కాలిక డ్రైవర్‌ దొంగిలించి విక్రయించడం చర్చనీయాంశమైంది. కానీ ఆ దుకాణం నుంచి ఒక్కసీసా కూడా అక్రమంగా విక్రయించలేదని ఎక్సైజ్‌ అధికారులు తేల్చారు. జిల్లాలో 87 దుకాణాలు ఉంటే ఏ ఒక్క దుకాణం నుంచి కూడా స్టాక్‌ మాయం కాలేదనే అధికారుల వాదన. రాజన్న సరిసిల్ల జిల్లాలో 41 దుకాణాలు ఉంటే దాదాపు అన్ని దుకాణాల్లో మద్యం మాయమైందనేది బహిరంగ రహస్యం. కానీ ఇక్కడ కూడా ఒక్క కేసు నమోదు కాలేదు. జగిత్యాలలోని 64 దుకాణాలకు గాను అంగడిబజార్‌లోని ఒక్క దుకాణంపైనే కేసు నమోదు చేసి, 6వ తేదీన తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ మిగతా 63 దుకాణాల నుంచి కూడా ఒక్క క్వార్టర్‌ బాటిల్‌ కూడా బయటకు వెళ్లలేదనే అధికారుల మాట. దుకాణాల్లో మద్యం దుకాణాల్లోనే ఉండగా... జనానికి రెండు మూడింతల ధరలకు మందు ఎలా వచ్చిందో ఎక్సైజ్‌ అధికారులే చెప్పాలి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా