‘ప్రసాదం’.. హుష్‌!

8 Jun, 2020 09:24 IST|Sakshi
చేప ప్రసాదం స్వీకరిస్తున్న బత్తిని హరినాథ్‌ గౌడ్‌ (ఫైల్‌)

నేటి చేప ప్రసాదం పంపిణీ నిలిపివేత      

175 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి   

కరోనాతో ఈ ఏడాది పూర్తిగా రద్దు  

నిర్వాహకులు బత్తిని హరినాథ్‌ గౌడ్‌ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌‌: ఆ రోజు కోసమే ఆస్తమా రోగులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. మృగశిర కార్తె అరుదెంచే అరుదైన సందర్భాన చేప ప్రసాదం స్వీకరించేందుకు వేలాది మంది తరలివస్తుంటారు. కానీ.. ఈసారి వీరి ఆశలపై కోవిడ్‌ –19 నీళ్లు చల్లింది. ఆస్తమా రోగులు ఆపన్నహస్తంగా భావించే చేప ప్రసాదానికి తొలిసారిగా బ్రేక్‌ పడింది. 175 ఏళ్లపాటు నిర్విరామంగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా రద్దు చేశారు. సోమ, మంగళవారాల్లో (ఈ నెల 8 ఉదయం 8.30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 8 గంటల వరకు) చేపట్టనున్న చేప ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు బత్తిని హరినాథ్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితమే ఈ విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వేలాదిగా తరలివచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉండదని, అంతేకాకుండా రాత్రిపూట కర్ఫ్యూ తదితర కారణాల తో చేప ప్రసాదం అందించడం దుస్సాహసమనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరినాథ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. 

ఇలా పంపిణీ చేసేవారు..
ప్రతి ఏడాది చేప ప్రసాదం తయారీలో భాగంగా పంపిణీకి ఒకరోజు ముందు దూద్‌బౌలిలోని బత్తిని కుటుంబ సభ్యుల స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ చేసేవారు.  అనంతరం చేప ప్రసాదాన్ని తయారీకి ఉపక్రమించేవారు. తొలుత వీరి కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకునేవారు. ఈ తర్వాత ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టేవారు. ఈసారి ఇవేవీ చేపట్టడంలేదు. 

మొదట్లో 50 కిలోలే..  
మొదట్లో 50 కిలోల వరకు తయారైన చేప ప్రసాదం ఆ తర్వాత 3.5 క్వింటాళ్లకు చేరుకుంది. కొన్నాళ్ల వరకు చేపమందుగా ప్రాచుర్యం పొందగా.. అనంతర కాలంలో చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతుంటారు.  

అప్పట్లో మారిన వేదికలు..
బత్తిని హరినాథ్‌ గౌడ్‌ పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలిలోనే చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేవారు
1997లో పాతబస్తీలో జరిగిన మత కలహాల కారణంగా ఈ వేదిక నిజాం కాలేజీ గ్రౌండ్‌కు మార్చారు.  
1998లో అప్పటి ప్రభుత్వం చేపప్రసాదం పంపిణీకి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను కేటాయించింది  
♦ అనంతరం 2012లో బత్తిని మృగశిర ట్రస్ట్‌కు కేటాయించిన కాటేదాన్‌లోని ఖాళీ స్థలంలో పంపిణీ జరిగింది. పంపిణీ సందర్బంగా తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో తిరిగి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది.  
నాటి నుంచి పోయిన ఏడాది వరకు చేప ప్రసాదం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనే కొనసాగింది.   
కరోనా వైరస్‌ కారణంగా ఈసారి పంపిణీకి బ్రేక్‌ పడింది  

దయచేసి ఎవరూ రావొద్దు..  
ప్రస్తుతం ప్రపంచాన్ని కోవిడ్‌ వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉంటున్న రోజులివి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేప ప్రసాదం పంపిణీ సరైంది కాదని భావించాం. పంపిణీ చేపడితే ఎన్నో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చేప ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో పంపిణీ చేయం. దీని కోసం ఎవరూ రావద్దని స్పష్టం చేస్తున్నాం.  
– బత్తిని హరినాథ్‌ గౌడ్‌  

మరిన్ని వార్తలు