ఈడబ్ల్యూఎస్‌ నిర్ధారణ ఎలా?

7 Mar, 2019 03:00 IST|Sakshi
వివిధ నోటిఫి కేషన్లలో ఉద్యోగ వివరాలు

అగ్రకుల పేదలకు సర్టిఫికెట్ల జారీపై స్పష్టత కరువు 

వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం 

ఆందోళన చెందుతున్న రాష్ట్ర అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) ధ్రువీకరణపై అయోమయం నెలకొంది. అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈమేరకు చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్రం ఆ దిశగా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగ ప్రకటనల్లో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తోంది. ఈ మేరకు గత నెలలో పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే, ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణపై స్పష్టత కొరవడింది. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణపత్రాల జారీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలి. కానీ ఈడబ్ల్యూఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ దరఖాస్తు ప్రశ్నార్థకంగా మారింది. ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే తమకెలాంటి ఆదేశాలు లేవని, ధ్రువీకరణపత్రం ఇవ్వడం సాధ్యం కాదని సమాధానమివ్వడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. 

ధ్రువీకరణ లేకుంటే ఓపెన్‌ కేటగిరీ... 
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ), ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ), వేర్‌హౌస్‌ కార్పొరేషన్, జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) తదితర విభాగాల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో దాదాపు వెయ్యికిపైగా పోస్టులున్నట్లు అంచనా. ఒక్క ఆర్‌ఆర్‌బీలోనే ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 326 పోస్టులున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సందర్భంగా ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీని ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రం సంఖ్యను ఎంట్రీ చేయాలి. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జారీ చేయడం లేదు. దీంతో ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతో చివరకు ఓపెన్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవల్సి వస్తోంది. ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రానికి సంబంధించి ఆ కేటగిరీలోని ఉద్యోగాలభర్తీ కావు. 

జనరల్‌ కేటగిరీకే దరఖాస్తు
ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీని నిర్ధారించి ఉద్యోగాల భర్తీ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతోంది. ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికేట్లు జారీ చేయకపోవడంతో వారంతా ఓసీ కేటగిరీకే దరఖాస్తు చేసుకోవల్సి వస్తోంది.      
– అయ్యప్పరెడ్డి, తొర్రూర్, మహబుబాబాద్‌ జిల్లా 

>
మరిన్ని వార్తలు