పరిహారం ఇచ్చి కదలండి..

16 Aug, 2019 11:02 IST|Sakshi

సాక్షి, జడ్చర్ల :  తమకు ఇప్పటి వరకు పరిహారం డబ్బులు ఇవ్వలేదని, పునరావాసం కల్పించలేదని ఇలాంటి పరిస్థితుల్లో పనులు ఎలా ప్రారంభిస్తారంటూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా ఉదండాపూర్‌ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ పనులను గురువారం వల్లూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. కాళేశ్వరం పూర్తికావటంతో పెద్ద ఎత్తున యంత్రాలను ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనులు చేసేందుకు తరలించారు. రిజర్వాయర్‌లో ఇప్పటికే నవాబుపేట మండలం ఖానాపూర్‌లో పనులు పూర్తికావస్తుండగా వల్లూరు, ఉదండాపూర్‌లో మాత్రం ప్రారంభించలేదు. ఇదిలాఉండగా పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టరు ప్రయత్నించగా వల్లూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పనులు ప్రారంభించే ప్రాంతానికి చేరుకోవటంతో పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి సైతం అక్కడికి చేరుకొని గ్రామస్తులతో ఆయన చర్చలు జరిపారు. 

శంకరాయపల్లి వద్ద ఇంటి నిర్మాణాలు చేయాలి
తమకు పునరావాసం కింద శంకరాయపల్లి వద్ద ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరారు. బండమీదిపల్లి శివారులో స్థలాన్ని ఖరారు చేశామని తహసీల్దార్‌ వారికి తెలియజేయగా తమకు సమాచారం లేకుండా, అంగీకరించకుండా ఎలా నిర్ణయిస్తారని వారు ప్రశ్నించారు. తమకు శంకరాయపల్లి వద్దే స్థలం కావాలని గ్రామస్తులు కోరారు. శంకరాయపల్లి వద్ద కేటాయించిన స్థలంకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ వేశామని తహసీల్దార్‌ గుర్తుచేశారు. పరిహారం డబ్బులు సైతం ఇంకా రాలేదని కొందరు రైతులు   వివరించారు. 

నిర్వాసితులకు సరైన న్యాయం చేయాలి: బీజేపీ
ఉదండాపూర్‌ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సరైన న్యాయం చేయాలని బీజేపి నాయకుడు పాలాది రాంమోహన్‌ డిమాండ్‌ చేశారు. వల్లూరు వాసుల ఆందోళనకు బీజేపి గురువారం మద్దతునిచ్చింది. ఈ సందర్భంగా తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డితోనూ రాంమోహన్‌ మాట్లాడుతూ.. గ్రామస్తులు అడిగిన చోట ఇంటి నిర్మాణాలు చేయాలని, పరిహారం అందరికి వెంటనే ఇవ్వాలన్నారు. రైతులు, గ్రామస్తుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తాము అండగా ఉంటామని ప్రకటించారు.  

మరిన్ని వార్తలు