నోకాంట్రాక్ట్‌.. నో ఔట్‌ సోర్సింగ్‌

28 Oct, 2017 00:58 IST|Sakshi

భవిష్యత్తులో శాశ్వత ఉద్యోగ నియామకాలను ఆ ప్రక్రియలో చేపట్టం

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తాం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం

ప్రభుత్వోద్యోగాలపై విపక్షాలది దుష్ప్రచారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బద్నాం చేస్తున్నాయి

కాంట్రాక్ట్‌ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామంటే కోర్టుకెళ్లాయి : అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో భవిష్యత్తులో భర్తీ చేసే శాశ్వత ఉద్యోగాలకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సేవలు, నియామకాలు చేపట్టబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై సభ్యులు ఆర్‌.కృష్ణయ్య, అక్బరుద్దీన్‌ ఒవైసీ అడిగిన ప్రశ్నలపై ముఖ్యమంత్రి స్పందించారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దుర్మార్గమైన ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు విధానాన్ని తెచ్చి ఉద్యోగులు అర్ధాకలితో ఉండేలా చేశాయని, కానీ తమ ప్రభుత్వం దాన్ని రూపుమాపే చర్యలు తీసుకుందన్నారు. ఏ ఒక్క ఉద్యోగి అర్ధాకలితో ఉండకూడదనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

విపక్షాలది దుష్ప్రచారం...
ప్రభుత్వోద్యోగాల కల్పన విషయంలో విపక్షాలు పనిగట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేస్తున్నాయని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్న అందరికీ ఎవరూ ఉద్యోగాలు, ఉపాధి కల్పించలేరని, అయినా ఈ విషయంలో ప్రధాని మోదీని, తమను విపక్ష పార్టీలు బద్నాం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అనేక రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని, అందులో ప్రభుత్వపరంగా లభించే ఉద్యోగాలకు పర్మినెంట్‌ విధానం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

తమ ప్రభుత్వం కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామంటే కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాయని... అందుకే గాంధీ భవన్‌ ముందు కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేశారని సీఎం గుర్తుచేశారు. త్వరలోనే హోంగార్డుల సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. వారిని క్రమబద్ధీకరించే క్రమంలో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయన్నారు. ఉద్యోగ కల్పన విషయంలో రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరం శాసనసభకు, సభ్యులకు ఉందన్నారు. అంతకుముందు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ క్రమబద్ధీకరణ విషయంలో న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని సూచించారు.

రిజిస్టర్‌ చేయని ఆలయాల అర్చకులకూ వేతనాలపై త్వరలో భేటీ...
దేవాదాయశాఖ పరిధిలో రిజిస్టర్‌ చేయని దేవాలయాలను పరిగణనలోకి తీసుకొని అక్కడి అర్చకులకు సైతం వేతన సౌలభ్యం కల్పించాలన్న అంశంపై ఈ సమావేశాల్లోనే శాసన సభ్యులు, అధికారులతో ప్రత్యేక భేటీ నిర్వహించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అర్చకులు, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అర్చకుల సమస్యలపై శాసనసభలో విపక్ష సభ్యులు సతీశ్‌ కుమార్, అక్బరుద్దీన్‌లు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు.

మసీదుల్లో పని చేస్తున్న మౌజన్, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్నామని, అయితే వారికి దేవాలయ అర్చకులకు ఇస్తున్న మాదిరే ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలన్న సభ్యుల సూచనను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా సభ్యులతో భేటీ ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని మసీదుల్లో ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనాలు పెంచుతామని సీఎం తెలిపారు. అన్ని రకాల ఆలయాల అర్చకులను సమానంగా చూడాలంటూ అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ దేశంలో లౌకికవాదం ఎంత బలంగా ఉందో అక్బరుద్దీన్‌ స్టేట్‌మెంట్‌తో తెలుస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు