శాతవాహనలో స్నాతకోత్సవం ఎప్పుడూ..?!

14 Dec, 2018 10:42 IST|Sakshi

శాతవాహనలో కలగా పట్టా పండుగ

పదేళ్లు గడిచినా దక్కని భాగ్యం

ఒక్కసారి కూడా నిర్వహించని ఎస్‌యూ

దృష్టిసారించని వర్సిటీ అధికారులు

పట్టించుకోని పరీక్షల విభాగం

నిరాశతో వర్సిటీ విద్యార్థివర్గాలు

యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు స్నాతకోత్సవం కీలక ఘట్టం. అలాంటి స్నాతకోత్సవాన్ని శాతవాహన యూనివర్సిటీ స్థాపించి దశాబ్దం దాటినా ఇంతవరకు ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో విద్యార్థులు పట్టాపండుగ భాగ్యానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు స్నాతకోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తున్నప్పటికీ శాతవాహన అధికారులు మాత్రం దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్నాతకోత్సవం నిర్వహించాలని విద్యార్థులు ఏళ్ల తరబడి విన్నవిస్తున్నా.. అధికారులు పెడచెవినపెడుతున్నారు. యూనివర్సిటీ అధికారులు,  పరీక్షల విభాగం పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. 

సాక్షి, కరీంనగర్‌: శాతవాహన యూనివర్సిటీ ప్రారంభమై పదేళ్లు గడుస్తోంది. వందల సంఖ్యల్లో విద్యార్థులు పట్టభద్రులై వెళ్తున్నప్పటికీ వారు వర్సిటీ ఛాన్స్‌లర్‌ చేతులమీదుగా పట్టాలు అందుకునే భాగ్యం మాత్రం కోల్పోతున్నారు. గతంలో ఒకరిద్దరు వీసీల కాలంలో ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అంతా ఇన్‌చార్జి వీసీల పాలనే జరుగుతుండడంతో సాధ్యపడలేదని కనిపిస్తోంది. కానీ సంబంధిత విభాగం అధికారుల సోమరితనంతోనే.. స్నాతకోత్సవానికి బ్రేక్‌ పడుతున్నట్లు యూనివర్సిటీ వర్గాల ద్వారా సమాచారం. ఏదిఏమైనా యూనివర్సిటీ ఈ సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించకుంటే పదేళ్లు గడిచినా పట్టా పండగ నిర్వహించలేదనే అపవాదును ఎదుర్కొవడం ఖాయమని విద్యారంగ నిపుణుల భావన.

కార్యరూపం దాల్చని స్నాతకోత్సవం
స్నాతకోత్సవం నిర్వహించాలని గతంలో వీరారెడ్డి వీసీగా ఉన్నప్పుడు 2014లో గవర్నర్‌ చేతులమీదుగా నిర్వహించాలని భావించినా రాష్ట్ర విభజన సమయం కావడంతో అప్పటి పరిస్థితుల్లో ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత 2015 నుంచి 2017 వరకు బి.జనార్దన్‌రెడ్డి ఇన్‌చార్జి వీసీగా విధులు నిర్వహించిన సమయంలో మరోసారి స్నాతకోత్సవం అంశం తెరమీదికొచ్చినా.. ఆయన మున్సిపల్‌శాఖ కీలక బాధ్యతల్లో ఉండడంతో కుదరలేదు. ఆ తర్వాత స్నాతకోత్సవం నిర్వహించాలనే ఆలోచనకు కూడా ఆయన సమయం కేటాయించే పరిస్థితులు లేకపోవడంతో అది కాస్తా అటకెక్కింది. ఆయన తర్వాత 2017 ఆగస్టు 30 నుంచి టి.చిరంజీవులు ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతున్నప్పటికీ ముఖ్య బాధ్యతల్లో భాగంగా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటుండడంతో ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప వర్సిటీకి సమయం కేటాయించడం లేదు.  దీనికితోడు ప్రభుత్వం రెగ్యులర్‌ వీసీ నియామక ప్రక్రియ తుదిదశకు వచ్చింది. ఈ తరుణంలో ఇన్‌చార్జి వీసీ స్నాతకోత్సవ నిర్వహణకు సముఖత చూపేలా లేరని తెలుస్తోంది. ఇలా దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్నాతకోత్సవ కార్యక్రమానికి విద్యార్థులు దూరమవుతున్నారు. 

రాష్ట్రంలోనే నిర్వహించని ఏకైక వర్సిటీ
రాష్ట్రంలో శాతవాహన యూనివర్సిటీతోపాటు మహాత్మగాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలను ఒకేసారి ప్రారంభించారు. ఒక్క శాతవాహన తప్ప అన్ని వర్సిటీలు ఒక్కోసారి స్నాతకోత్సవాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా పరీక్షల విభాగం అధికారుల నుంచి ప్రయత్నాలు లేకపోవడమే దీనికి కారణమని విద్యార్థుల్లో చర్చ జరుగుతుంది. కొత్తగా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ఉమేశ్‌కుమార్‌ దీనిపై ప్రత్యేక దృష్టిసారించి తీవ్రంగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఈసారి ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఏదిఏమైనా శాతవాహన యూనివర్సిటీ అధికారులు స్నాతకోత్సవంపై దృష్టిసారించి విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి నిర్వహించాలని వివిధ కోర్సుల విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 

వచ్చే మే లోగా నిర్వహిస్తాం
శాతవాహన యూనివర్సిటీ ఏర్పడిన నాటినుంచి స్నాతకోత్సవం నిర్వహించనిది వాస్తవమే. గతంలో కొన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యపడలేదని తెలిసింది. బాధ్యతలు చేపట్టిన యూనివర్సిటీలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారంతో పాటు  స్నాతకోత్సవంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. మే 2019 లోపు స్నాతకోత్సవానికి  ప్రణాళిక రూపొందించి కచ్చితంగా నిర్వహిస్తాం.  – ఉమేష్‌కుమార్, శాతవాహన రిజిస్ట్రార్‌ 

మరిన్ని వార్తలు