55 ఏళ్లు దాటిన పోలీసులకు కరోనా డ్యూటీ ‘నో’

31 Mar, 2020 03:21 IST|Sakshi

అనారోగ్య కారణాల రీత్యా ఇతర విధులకు బదిలీ

కీలక నిర్ణయం తీసుకున్న డీజీపీ మహేందర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 55 ఏళ్లు దాటిన పోలీసులకు క్షేత్రస్థాయి విధులు కాకుండా లూప్‌లైన్‌ డ్యూటీలు వేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. పదిరోజులుగా లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడంలో నిద్రాహారాలు మాని 24 గంటలపాటు కష్టపడుతున్న పోలీసులకు ఇది శుభవార్తే. ఎందుకంటే కరోనాతో వృద్ధులకే ప్రాణాపాయం అధికం. పోలీసుశాఖలో 55 ఏళ్లు దాటిన వారు వివిధ విభాగాల్లో దాదాపు 5,000 మంది వరకు ఉంటారు. వీరిలో చాలామంది రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నారు. సర్వీసులో ఒత్తిళ్లతో ఇప్పటికే బీపీ, డయాబెటిక్, కిడ్నీ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినా, వారంతా లాక్‌డౌన్‌ విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో డీజీపీ తీసుకున్న నిర్ణయంతో అటువంటి వారికి ఊరట లభించినట్టయింది.

సమస్య ఉంటే చెప్పండి..
అనారోగ్యంతో విధులు నిర్వహిస్తున్న వారు ఎప్పుడెలాంటి సమస్య వచ్చినా, ఆలస్యం చేయకుండా వెంటనే యూనిట్‌ ఆఫీసర్‌ దృష్టికి తేవాలని డీజీపీ ఆదేశించారు. కరోనాను నిలువరించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ప్రకటించిన కరోనా ఇన్సూరెన్స్‌ పథకంలో పోలీసులనూ భాగస్వామ్యం చేసే అవకాశాన్ని డీజీపీ çపరిశీలిస్తున్నారు. కాగా, ఇటీవల పదోన్నతి శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ (ఏఆర్‌) హెడ్‌కానిస్టేబుళ్ల ఫలితాలు కూడా త్వరలో ప్రకటించాలని నిర్ణయించారు. పోలీసుల సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకుంటున్న డీజీపీ మహేందర్‌రెడ్డికి పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపీరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

కానిస్టేబుల్‌కు కేటీఆర్‌ సెల్యూట్‌ 
లాక్‌డౌన్‌లో చిక్కుకుని ఉపాధిలేక, ఆకలితో సతమవుతున్న వలసజీవుల ఆకలి తీర్చేందుకు సైదాబాద్‌ ఠాణా కానిస్టేబుల్‌ 100 కిలోల బియ్యాన్ని టీమ్‌ ఎన్‌జీవో సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఇది తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ అతని పేరు తెలియకున్నా.. ‘సదరు కానిస్టేబుల్‌ అధికారి, అతని భార్యకు సెల్యూట్‌ చేస్తున్నా’అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు