చాటింగుల్లేవ్‌.. చీటింగుల్లేవ్‌ !

22 Apr, 2020 10:03 IST|Sakshi

లాక్‌డౌన్‌ ఎఫెక్టుతో కుటుంబీకులంతా ఇళ్ళల్లోనే

ఫలితంగా గణనీయంగా తగ్గిన ఫ్రెండ్‌షిప్‌ స్కామ్స్‌  

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ ఎఫెక్టుతో దాదాపు అన్ని కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. నడుస్తున్న వాటిలోనూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జరగడమో లేదా పరిమితంగా సిబ్బంది ఉండటమో జరుగుతోంది. దీంతో దాదాపు కుటుంబ సభ్యులు అంతా ఇళ్ళ వద్దే ఉంటున్నారు. దీని ప్రభావం ఫ్రెండ్‌షిప్‌ ఫ్రాడ్‌పై పడింది. రాజధానిలో ఈ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలతో పాటు మార్చిలో లాక్‌డౌన్‌ మొదలయ్యే వరకు దాదాపు పది కేసుల వరకు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి సోమవారం వరకు కేవలం ఒకే ఒక్క కేసు రిజిస్టర్‌ అయింది. ఈ ఫ్రెండ్‌ షిప్‌ స్కామ్‌కు మూలం ఫేస్‌బుక్‌ పేజీలే. బోగస్‌ పేర్లు, నకిలీ ఐడీలు, ఫోటోలతో ఫేస్‌బుక్‌లో పేజీలు క్రియేట్‌ చేసే నైజీరియన్‌ ఫ్రాడ్‌స్టర్స్‌ వీటిని వినియోగించి అనేక మంది దక్షణ భారతీయులకు ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపిస్తుంటారు.

యువకులకు యువతుల మాదిరిగా, యువతులకు యువకులుగా వీటిని పంపుతారు. ఎదుటి వాళ్ళు స్పందించి యాక్సప్ట్‌ చేసిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. తాము అమెరికా, లండన్, కెనడాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నట్లు చెప్తూ కొన్ని రోజుల పాటు ఫేస్‌ బుక్‌ మెసెంజర్‌ ద్వారా వారితో సంప్రదింపులు కొనసాగిస్తారు. తాము టార్గెట్‌ చేసిన వ్యక్తులు పూర్తిగా బుట్టలో పడ్డారని తేలిన తర్వాత సైబర్‌ నేరగాళ్ళు తమ వాట్సాప్‌ నెంబర్లు షేర్‌ చేస్తారు. దాదాపు ఇవన్నీ వర్చువల్‌ నెంబర్లుగా పిలిచే ఇంటర్‌నెట్‌ ఆధారితమైనే అయి ఉంటాయి. ఈ కారణంగా వీరు నైజీరియా నుంచి వినియోగించినా అమెరికా, లండన్‌లకు చెందిన నెంబర్లే డిస్‌ప్లే అవుతూ ఉంటాయి.

దీంతో సైబర్‌ నేరగాళ్ళు చెప్తున్న మాటల్ని బాధితులు పూర్తిగా నమ్మేస్తారు. హఠాత్తుగా ఓ రోజు మన స్నేహానికి గుర్తుగా మీకో గిఫ్ట్‌ పంపిస్తున్నామంటూ చెప్పి కొన్ని ఫొటోలను సెండ్‌ చేస్తారు. ఇది జరిగిన తర్వాతి రోజు విమానాశ్రయంలోని ఎయిర్‌కార్గో అనో,  కస్టమ్స్‌ అధికారులనో చెప్పుకున్న వ్యక్తుల నుంచి ఫోన్‌ వస్తుంది. ఫలానా దేశం నుంచి ఫలానా వ్యక్తి విలువైన గిఫ్టులు, నగదు పంపాడని పన్ను చెల్లించాలని, లేదంటే కేసు అవుతుందని చెప్పి అందినకాడికి దండుకుంటారు. లాక్‌డౌన్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులు, కొరియర్స్‌ రద్దు కావడంతో ఈ పంథాలో మోసం చేయడం నైజీరియన్లకు సాధ్యం కావట్లేదు.

దీంతో దేశంలోని మెట్రో నగరాల్లో ఉంటున్న వారిగా చెప్పుకుంటూ పరిచయం చేసుకుని, చాటింగ్స్‌ తర్వాత వ్యాపార, విద్య, వ్యక్తిగత అవసరాల పేర్లు చెప్పి డబ్బు అడుగుతున్నారు. యువతి/యవకుడిగా చెప్పుకునే ఈ సైబర్‌ నేరగాడితో చాటింగ్‌ చేస్తేనే ఎదుటి వ్యక్తి వారి వల్లో పడి బాధితుడిగా మారతాడు. అయితే ప్రస్తుతం అలా చేయడానికి ఇక్కడి వారికి కుదరట్లేదు. తల్లిదండ్రులో, భార్య, భర్త లేదా ఇతర కుటుంబీకులు ఇంట్లోనే ఉంటుండటంతో చాటింగ్‌ సాధ్యం కావట్లేదు. తమ ఉనికి, స్వరూపం బయటపడుతుందనే ఉద్దేశంతో ఈ తరహా సైబర్‌ నేరగాళ్ళు ఫోన్లు, వీడియో కాల్స్‌ కు దూరంగా ఉంటారు. చాటింగ్‌ చేయనిదే ఎవరూ ఆ సైబర్‌ నేరగాళ్ళ వల్లో పడరు.  ఫలితంగా మోసపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. నగరానికి చెందిన ఓ యువకుడు మాత్రం ఈ ఫ్రెండ్‌ షిప్‌ ఫ్రాడ్‌ బారినపడి రూ.91 వేలు పోగొట్టుకున్నాడు. దీనిపై సోమవారం కేసు నమోదైంది. లాక్‌డౌన్‌ తర్వాత నమోదైన కేసు ఇదోక్కటే కావడం గమనార్హం.  

మరిన్ని వార్తలు