ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు

23 Sep, 2017 02:51 IST|Sakshi

రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న

మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ

బేల(ఆదిలాబాద్‌): వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతవుతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండల బేలతోపాటు మశాల(బి), దహెగాం, మణియార్‌పూర్, గూడ, కాంఘర్‌పూర్, బెదోడ, సాంగిడి గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బేలలోని సబ్‌ మార్కెట్‌ యార్డులో జైనథ్‌ మార్కెట్‌ కమిటీ నిధులు రూ.1.25 కోట్ల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను సంఘటితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిందని చెప్పారు. రైతు సమితులు దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం చేసే ప్రక్రియలో భాగంగా భూ ప్రక్షాళన కోసం పనిచేస్తాయని తెలిపారు. వచ్చే ఖరీప్‌ సీజన్‌ నుంచి ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం ఆర్థిక చేయూత అందించడానికి ప్రారంభించనున్న పెట్టుబడి పథకానికి పరిశీలన కోసం ఈ సమితులు కీలకంగా పనిచేస్తాయని అన్నారు.

ప్రభుత్వం బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆడపడుచులకు ప్రేమతో చీరలు పంపిణీ చేస్తోందని, ఎక్కడో ఒకట్రెండు చీరలు సరిగా లేకపోతే.. ఆ చీరలను కాల్చడం, ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇష్టముంటేనే ఆడపడుచులు ఈ చీరలను తీసుకోవాలని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రావుత్‌ మనోహర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్‌ కస్తాల ప్రేమల, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టాక్రే గంభీర్, మండల అధ్యక్షుడు ఓల్లఫ్‌వార్‌ దేవన్న, ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌రెడ్డి, నాయకులు మస్కే తేజ్‌రావు, బండి సుదర్శన్, నిపుంగే సంజయ్, జక్కుల మధుకర్, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, తన్వీర్‌ఖాన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు