పడకేసిన పాలన..!

21 Jun, 2015 00:50 IST|Sakshi
పడకేసిన పాలన..!

- అభివృద్ధికి నోచుకోని ఆస్పత్రులు
- నిధులున్నా ఖర్చు చేయని వైనం
- వైద్యం అందక రోగుల ఇబ్బందులు
సాక్షి, సిటీబ్యూరో:
అవి ప్రత్యేక హోదా, గుర్తింపును సంతరించుకున్న చరిత్రాత్మకమైన ఆస్పత్రులు. ప్రస్తుతం మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆస్పత్రులను ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా.. సౌకర్యాల కొరత నేటికి వెంటాడుతోంది. ఖరీదైన కార్పొరేట్ వైద్యం సంగతేమో కానీ.. చికిత్స కోసం వచ్చిన వారికి కనీసం పడుకునేందుకు పడకలు దొరకని దుస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఛాతీ, మానసిక, ఈఎన్‌టీ, సరోజినిదేవి, ఎంఎన్‌జే క్యాన్సర్, ఫీవర్, ఆ స్పత్రుల బలోపేతానికి ఎన్నడూ లేని విధంగా రూ.5,20 కోట్లు కేటాయించింది. రోగులు నిష్పత్తికి తగినట్లుగా పడకల సామర్థ్యం పెంచుతున్నట్లు ప్రకటించింది.
 
ఉస్మానియాలో నేలపైనే..
ప్రస్తుతం ఉన్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని 1925లో ప్రారంభించారు. 1925-75 వరకు కేవలం 253 పడకలు ఉండగా, 1976లో  650కి పెంచారు. ప్రస్తుతం 1,168కి చేరుకుంది. అయితే ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500-2000 మంది రోగులు వస్తుంటారు. అత్యవసర విభాగానికి  వంద నుంచి 150 కేసులు (రోడ్డు, అగ్ని, ఇతర ప్రమాదాలు, గుండె, మూత్రపిండాలు, ఇతర జబ్బులు) వస్తుంటాయి. వీరందరికి సరిపడా మంచాలు ఆస్పత్రిలో లేవు. దీంతో రోగులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేయాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చిన వారికి వెంటిలేటర్లే కాదు.. కనీసం పడకలు దొరకని దుస్థితి నెలకొంది.
 
ఇన్‌ఫెక్షన్‌తో శిశువులు మృతి..
నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రికి ప్రతి రోజూ   800-1200 మంది వస్తుంటారు. ఇక్కడ నిత్యం వెయ్యి మంది చికిత్సలు అందజేస్తున్నారు. వీరిలో అప్పుడే పుట్టిన పిల్లలే 200కు పైగా ఉంటారు. రోగుల నిష్పత్తికి తగ్గట్లు మంచాలు ఏర్పాటు చేయక పోవడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు నుంచి ముగ్గురిని పడుకోబెడుతున్నారు. ఆస్పత్రిలో రోజుకు ఐదు నుంచి ఏడుగురు చనిపోతుండగా..అందులో ఇద్దరు శిశువులు కేవలం ఇన్‌ఫెక్షన్ వల్లే మృతిచెందుతున్నట్లు స్వయంగా వైద్యులే అంగీకరిస్తున్నారు.
 
గర్భిణులకు తప్పని ప్రసవ వేదన..
సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఓపీకి ప్రతి రోజూ సుమారు 500 మంది గర్భిణులు వస్తుంటారు. ఇక్కడ ప్రతి నెలా 800కు పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. పడకలు లేక పోవడంతో ఒకే మంచంపై ఇద్దరు గర్భిణులకు వసతి కల్పిస్తున్నారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు.

మరిన్ని వార్తలు