ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్‌

15 Mar, 2017 16:21 IST|Sakshi
ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటూ వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, మంచిగా పనిచేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారని ఆయన బుధవారం శాసనమండలిలో తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్‌ వెల్లడించారు. గ్రామాల్లో నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, కుల వృత్తులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

ఇక తెలంగాణ ఐ పాస్‌ను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. విద్యుత్‌ శాఖలో 24 వేలమంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. అలాగే తెలంగాణలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి అనేది లేకుండా చూస్తామన్నారు. హోంగార్డులందరికి కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లోనే ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్‌ బిల్లు తెస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మీ పథకానికి కేటాయింపులను రూ.75,116కి పెంచామన్నారు.