రైతుబంధు, రుణమాఫీ యథాతథం

11 Mar, 2019 01:34 IST|Sakshi

ఎన్నికల కోడ్‌ ప్రభావం ఉండదంటున్న వ్యవసాయ వర్గాలు 

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ప్రభావం రైతుబంధు, రుణమాఫీ పథకాలపై పడదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధు కొనసాగుతున్న కార్యక్రమమే అని, రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించినందున దానికీ అభ్యంతరం ఉండబోదని చెబుతున్నాయి. 

ఈ రెండు పథకాలకు రూ.18 వేల కోట్లు..
రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు, రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో  కేటాయించింది. రైతుబంధుకింద ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున అందజేయనుంది. ఇక రబీ సమయంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో పెట్టుబడి చెక్కులు ఇవ్వకూడదని, రైతులకు నేరు గానే వారి బ్యాంకు ఖాతాలకు రైతుబంధు సొమ్ము అందజేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో చెక్కుల ముద్రణను నిలిపివేసి రైతులకు బ్యాంకుల్లోనే నగదు జమ చేశారు. ఈసారి కూడా అదే జరగనుందని అంటు న్నారు. ఏప్రిల్‌ 11న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. మే 23న ఫలితాలు విడుదల వుతాయి. కాబట్టి ఫలితాల వెల్లడివరకూ ఎన్నికల కోడ్‌ ప్రభావం ఉంటుంది.

ఈలోగా రైతులకు ఖరీఫ్‌ పెట్టుబడి సొమ్ము ఇవ్వాలి కాబట్టి ఈసారి కూడా రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక రుణమాఫీ లబ్ధిదారుల నిర్ధారణపై బ్యాంకులు, వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నాయి. వారిని గుర్తించి చెక్కులు ఇస్తారా? నగదు బ్యాంకులకు అందజేస్తా రా తెలియాల్సి ఉంది. రుణమాఫీకి సంబంధించి రైతు ఖాతాలకు సొమ్ము వేస్తే బ్యాంకులు తమ అప్పుల కింద జమ చేసుకుంటున్నాయని, కాబట్టి చెక్కులు ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్‌ వెల్లడిం చిన నేపథ్యంలో ఎలా చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. కోడ్‌ పూర్తయిన తర్వాతే చెక్కుల కింద ఇస్తారన్న ప్రచారమూ ఉంది. 

మరిన్ని వార్తలు