హోంమంత్రికి ప్రగతిభవన్‌లో నో ఎంట్రీ!

2 Apr, 2020 01:49 IST|Sakshi

ప్రవేశద్వారం సిబ్బంది ఆపడంతో అక్కడ్నుంచే వెనుదిరిగిన మహమూద్‌ అలీ

ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదని వివరణ ఇచ్చిన హోంమంత్రి కార్యాలయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీకి ప్రగతిభవన్‌లో నేరుగా ప్రవేశం లభించలేదు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమీక్ష నిర్వహిస్తుండగా, మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో మహమూద్‌ అలీ సీఎంను కలిసేందుకు వచ్చారు. ప్రగతిభవన్‌ ప్రవేశ ద్వారం వద్దే ఆయన్ను భద్రతా సిబ్బంది నిలిపేశారు. కొంతసేపు అక్కడే వేచిచూసిన మహమూద్‌ అలీ తిరిగి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్‌ ముఖ్యమైన సమీక్ష నిర్వహిస్తున్నందున లోపలికి ఎవరినీ అనుమతించరాదని ఆదేశాలున్నాయని, హోంమంత్రి వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందేలోగా ఆయన వెళ్లిపోయారని ముఖ్యమంత్రి ముఖ్య భద్రతా అధికారి ఎంకే సింగ్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

ఎవరూ అడ్డుకోలేదు.. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన హోంమంత్రికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదని, ఆయనను ఎవరూ అడ్డుకోలేదని హోం మంత్రి కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో) శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం సీఎంను కలిసేందుకు వెళ్లగా.. అదే సమయానికి ఆయన గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధపడ్డారని తెలిసి హోంమంత్రి వెనుదిరిగారని వివరించారు. ము ఖ్యమంత్రిని కలుసుకోవడంలో హోంమంత్రి మహమూద్‌ అలీకి ఏనాడూ ఎలాంటి ఇబ్బందులూ ఎదురవలేదని, ఆయనను ప్రగతి భవన్‌లోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోలేదని స్పష్టంచేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా