కష్టమే?

17 Feb, 2019 09:19 IST|Sakshi

‘ఫైర్‌ సేఫ్టీ’ తనిఖీలపై ప్రభుత్వ ఆదేశం

అధికారులు, సిబ్బంది లేకుండా తనిఖీలెలా!  

గ్రేటర్‌లో లక్షల్లో భవనాలు.. అధికారులు ఇద్దరే..  

అమలుపై పలు అనుమానాలు

సాక్షి, సిటీబ్యూరో: మహానగర జనాభా దాదాపు కోటికి పైనే ఉంది. వివిధ వ్యాపార, వాణిజ్య భవనాలు, బహుళ అంతస్తుల నివాసాలు, స్కూళ్లు వంటి నిర్మాణాలు లక్షల్లో ఉన్నాయి. అయితే, వాటిలో ఎన్నింటికి ‘ఫైర్‌ సేఫ్టీ’ ఉందో అధికారులకే అంతుబట్టని ప్రశ్న. ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్‌లోను, ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ భవనంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించి నెలరోజుల్లోగా గ్రేటర్‌ లోని వాణిజ్య భవనాల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లపై తనిఖీలు చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. త్వరలో వేసవి రానున్నందున ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, పొరపాటున ప్రమాదం జరిగితే వెనువెంటనే తగిన చర్యలు తీసుకు నేందుకు వీలుగా  పకడ్బందీ తనిఖీలు నిర్వహించి, అన్నీ సవ్యంగా ఉండేలా చూడాలని మెమో సైతం జారీ చేసింది. అయితే, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఫైర్‌ సర్వీస్‌ విభాగంలో ఇద్దరు జిల్లా ఫైర్‌ అధికారులు, మరో ఇద్దరు స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్లు ఉన్నారు. వీరిలో తనిఖీలు చేసేది స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్లు మాత్రమే. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కేవలం ఇద్దరితో నగరంలోని రెండు లక్షల వాణిజ్య భవనాలను ఎలా తనిఖీ చేయాలో అంతుబట్టక ఫైర్‌ సర్వీస్‌ విభాగం అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. తనిఖీలకు ప్రత్యేక బృందాలను నియమించాలని మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సూచించినప్పటికీ, తనిఖీలు చేసేందుకు.. తగిన ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లున్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఆ విభాగంలో తగిన పరిజ్ఞానం ఉన్నవారు కావాలి. అలాంటి వారు జీహెచ్‌ఎంసీలో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. 

ప్రధాన భవనాలను తనిఖీ చేయాలన్నా..  
వాణిజ్య భవనాలన్నీ కాకపోయినా కనీసం అత్యధిక రద్దీ ఉండే సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, హోటళ్లు, హాస్పిటళ్లు, పబ్‌లు, బార్లు వంటి వాటిలో తనిఖీలు చేయాలన్నా సాధ్యంకాని పరిస్థితి. అవే దాదాపు 30 వేలుంటాయని అంచనా. వీటన్నింటినీ నెలరోజుల్లో కాదుకదా వేసవిలోగా తనిఖీ చేయడం అసాధ్యం. అన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసి.. ఏయే ఏర్పాట్లు చేయాలో పేర్కొంటూ నోటీసులివ్వాలంటే రోజుకు ఒక్కో అధికారి రెండు మూడు భవనాలు మించి తనిఖీ చేయడం సాధ్యంకాదు. సెలవులు తదితరమైనవి పరిగణనలోకి తీసుకుంటే దాదాపు వేయి భవనాలను తనిఖీ చేసేందుకే ఏడాది పడుతుంది. అలాంటిది అధికారుల లేమితో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్‌ఎంసీ ఫైర్‌ సేఫ్టీ విభాగం.. సమగ్ర తనిఖీలు చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతమున్న అధికారులతో ఎక్కువ రద్దీ ఉండే ముఖ్య భవనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలన్నా ఏళ్లు పడుతుంది. అత్యవసరంగా.. త్వరితంగా.. నెలల వ్యవధిలో సమగ్ర తనిఖీలు చేసి.. తగిన ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేసుకునేలా చర్యలు తీసుకోవాలంటే వందల మంది అధికారులు అవసరం. సంబంధిత రంగంలో పరిజ్ఞానం ఉన్న అధికారులు లేకుండానే ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి తగినంత మంది స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్లను, జిల్లా ఫైర్‌ ఆఫీసర్లను పంపించాల్సి ఉంది. లేని పక్షంలో వేసవిలో నిప్పు ముప్పు లేకుండా ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

భవనాల లెక్కలు లేకుండా ఎలా!
జీహెచ్‌ఎంసీలో దాదాపు 15 లక్షల భవనాలుండగా, అధికారిక లెక్కల మేరకే రెండు లక్షల వాణిజ్య భవనాలున్నాయి. అనధికారికంగా మరో లక్ష వరకు ఉంటాయని అంచనా. మూడు లక్షల భవనాల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు ఉన్నవి నాలుగు వేలు కూడా లేవు. ఈ విషయం అధికారులకూ తెలుసు. ఎక్కువ రద్దీ ఉండే హోటళ్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు వంటివే దాదాపు 30 వేల వరకు ఉంటాయి. అయితే, అధికారుల వద్ద మాత్రం కచ్చితమైన లెక్కలేదు. వారి వద్ద ఉన్న వివరాల మేరకు ఇలాంటివి పదివేల లోపునే ఉన్నాయి. 

మరిన్ని వార్తలు