శిక్షణ.. కలేనా!

17 Sep, 2014 01:35 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్ : వైద్య ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ప్రాంతీయ శిక్షణ కేంద్రాల ఏర్పాటు ఎంతకీ ముందుకు కదలడం లేదు. వరంగల్‌లో ప్రాంతీయ శిక్షణ కేంద్రం మంజూరై మూడేళ్లు గడిచింది. కానీ.. అది కలగానే మిగిలింది. పారామెడికల్, నర్సింగ్, వైద్య సిబ్బంది, వైద్యులకు వృత్తిపరమైన శిక్షణ కోసం తెలంగాణ వ్యాప్తంగా ఒక్క హైదరాబాద్‌లోనే శిక్షణ కేంద్రం ఉంది.

2011లో జాతీయ ఆరోగ్య శాఖ సిఫారసు మేరకు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ప్రాంతీయ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2011 ఆగస్టు 24న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో శిక్షణ కేంద్రాల ఏర్పాటు అటకెక్కింది. దీనికి సంబంధించిన ఫైల్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
 
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే...
వ్యాధుల నియంత్రణ, మాతా, శిశు సంరక్షణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, ఆరోగ్య కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, ఆర్థిక వ్యవహారాలపై అవగాహనతోపాటు వ్యక్తిత్వ నైపుణ్యం వంటి అంశాలు శిక్షణలో భాగంగా ఉంటాయి. వరంగల్ జిల్లాలో వైద్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో నూతన భవనం సిద్ధంగా ఉంది. దీన్ని శిక్షణ కేంద్రంగా మార్చితే వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉద్యోగులు ఇక్కడే శిక్షణ పొందే వెసులుబాటు ఉంటుంది. వేలాది మంది వైద్య ఉద్యోగులకు శిక్షణ పొందడం, పని తీరును మెరుగుపరచు కోవడం, పదోన్నతులు పొందడం సులభతరమని చెప్పాలి. కానీ... శిక్షణ కేంద్రాల ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండడంతో వెద్య ఉద్యోగులకు పూర్తి స్థారుులో శిక్షణ అందకుండా పోతోంది.
 
చిగురిస్తున్న ఆశలు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటే కేంద్రం ఉండడంతో అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం వీలుకావడంలేదు. వైద్య ఆరోగ్య శాఖ పరిపాలన విషయంలో ఇప్పుడు వరంగల్ జిల్లా ముద్ర ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తాటికొండ రాజయ్య ఉన్నారు. ఆరోగ్య శాఖ రాష్ట్ర డెరైక్టర్ పిల్లి సాంబశివరావు సైతం వరంగల్ జిల్లా వాసే. ఆరోగ్య శాఖకు సంబంధించి మంత్రి, పాలనపరమైన ఉన్నతాధికారి ఇద్దరూ జిల్లా వాసులే కావడంతో వైద్య ఆరోగ్య శిక్షణ కేంద్రానికి మోక్షం కలుగుతుందనే ఆశ చిగురిస్తోంది.

మరిన్ని వార్తలు