చార్మినార్‌.. నో హాకర్స్‌ జోన్‌

26 Apr, 2019 08:19 IST|Sakshi
చార్మినార్‌ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు

కట్టడం చుట్టూ 50 అడుగుల మేర ఏర్పాట్లు

పనులకు శ్రీకారం చుట్టిన అధికారులు

వలయాకారంలో మార్కింగ్‌ పనులు షురూ

వాహనాలు రాకుండా బొల్లార్డ్స్‌..

పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

సాక్షి,సిటీబ్యూరో: చారిత్రక ప్రాధాన్యం గల చార్మినార్‌కు భద్రతతో పాటు ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కట్టడం పరిసరాలు చిరు వ్యాపారులతో నిండిపోయి టూరిస్టులకు ఇబ్బందికరంగా మారాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చార్మినార్‌ చుట్టూ ఎలాంటి వ్యాపారాలు జరగకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా చారిత్రక కట్టడానికి నాలుగు వైపులా 50 అడుగుల వరకు ‘నో హాకర్‌ జోన్‌’ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రందేశంలోకి చిరు వ్యాపారులు ప్రవేశించకుండా బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో భాగంగా గురువారం మార్కింగ్‌ పనులు ప్రారంభించారు. ఈ పరిధి వరకు సందర్శకులు తప్ప ఇంకెవరూ లోపలకు రాకుండా ఉండేందుకు, చార్మినార్‌ అందాల్ని వీక్షించేవారికి ఆటంకం కలుగకుండా దాదాపు రెండు అడుగుల ఎత్తు బొల్లార్డ్స్‌ను బిగించనున్నారు. తద్వారా దీన్ని నో హాకర్స్‌ జోన్‌గా మార్చనున్నారు. చార్మినార్‌ కట్టడం నుంచి నాలుగు వైపులా గుల్జార్‌హౌస్, మక్కా మసీదు, సర్దార్‌ మహల్, లాడ్‌బజార్‌ వైపు ఈ జోన్‌ ఉంటుంది. ప్రస్తుతం చార్మినార్‌ వరకు కూడా చిరు వ్యాపారులు తమ వ్యాపారాలురెయిలింగ్స్‌పై కూడా సామగ్రిని ఉంచుతుండటంతో పర్యాటక ప్రాంతం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. పర్యాటకులకు.. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు ఈ తొక్కిసలాట సంకటంగా మారుతోంది. దీన్ని నిరోధిస్తూ, చార్మినార్‌ అందాలను ప్రశాంతంగా వీక్షించేలా 50 అడుగుల మేర హాకర్లెవరూ లేకుండా ఈ బొల్లార్డ్స్‌ ఏర్పాటు చేయనున్నారు. అందుకుగాను అవసరమైన మార్కింగ్‌ తోపాటు ఒకవైపు తవ్వకం పనులు కూడా చేపట్టారు.

ఈ 50 అడుగుల మేర వలయాకారం నుంచి 100 అడుగుల వరకు పర్యాటకులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు.. ఫొటోలు తీసుకునేందుకు ఏర్పాట్లు, అందమైన పూలకుండీలు వంటివి ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.80 లక్షలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వీటితోపాటు సుందరమైన ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ తదితర పనులు చేసే యోచనలో ఉన్నారు. అంతేకాదు.. భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న లైట్‌ అండ్‌ సౌండ్‌ షోను వీక్షించేవారి కోసం సీటింగ్‌ ఏర్పాట్లకు కూడా ఈ స్థలాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. చార్మినార్‌ పాదచారుల పథకంలో భాగంగా వాహనాలు రాకుండా దాదాపు రూ.3.5 కోట్లతో హైడ్రాలిక్‌ బొల్లార్డ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీలు వచ్చినప్పుడు, ఇతర అవసర సందర్భాల్లో మాత్రం ఇవి భూమిలోకి వెళ్లి వాహనాలకు దారిస్తాయి. ఇందుకు అవసరమైన కంట్రోల్‌రూమ్‌ను సమీపంలోని భవనంలో ఏర్పాటు చేయనున్నారు. నో హాకర్స్‌ జోన్‌లో మాత్రం కదలికలకు తావులేకుండా శాశ్వత బొల్లార్డ్‌లను ఏర్పాటు చేస్తారు.

 స్వచ్ఛ ఐకానిక్‌ పనుల్లో..
ఇక స్వచ్ఛ ఐకానిక్‌ చార్మినార్‌ పనుల్లో భాగంగా చార్మినార్‌ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు రూ.2 కోట్లతో నాలుగు ప్రత్యేక స్వీపింగ్‌ మెషిన్లు కొనుగోలు చేశారు. వీటిని త్వరలో వినియోగంలోకి  తేనున్నట్లు చార్మినార్‌ ప్రాజెక్ట్‌ ప్రత్యేక అధికారి, జీహెచ్‌ఎంసీ డైరెక్టర్‌(ప్లానింగ్‌) కె.బి. శ్రీనివాసరావు తెలిపారు. అఫ్జల్‌గంజ్‌ నుంచి గుల్జార్‌హౌస్‌ వరకు బ్యాటరీ వాహనాలను ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉంది. పాదచారుల పథకంలో భాగంగా తవ్విన డక్ట్‌లలో కేబుళ్ల అమరిక పనులు పూర్తి చేయాల్సి ఉంది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడ్డదిడ్డంగా వేలాడుతున్న విద్యుత్‌ తీగలు, ఫ్లెక్సీలు వంటివి తొలగించి, ఆయా మార్గాలను సూచించే సైన్‌బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.  

మరిన్ని వార్తలు