అంగన్‌వాడీలకు సెలవుల్లేవ్‌..

17 Mar, 2020 09:45 IST|Sakshi

సాక్షి, నిజాంసాగర్‌(జుక్కల్‌): కరోనా విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సర్కారు.. అంగన్‌వాడీ కేంద్రాలను మాత్రం విస్మరించింది. అన్ని విద్యాసంస్థలకు హాలీడేలు ఇచ్చి అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం ఇవ్వకపోవడంతో విస్మయానికి గురిచేస్తోంది. కేవలం సమయం కుదిస్తూ ఐసీడీఎస్‌ అధికారులు టీచర్లను ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు కేంద్రాలు తెరవాలని తెలిపారు. కేవలం రెండున్నర గంటల పాటు మాత్రమే పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్నం పూట పెట్టే భోజనాన్ని ఉదయమే పెడుతున్నారు. 

వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు 
జిల్లాలో 1,193 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా సుమారు 22,152 మంది చిన్నారుల ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు కరోనా వైరస్‌ బారిన పడకుండా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు వైద్యశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల చేతులను శుభ్రంగా కడగడంతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా చర్యలు చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తే చిన్నారులకు పౌష్టికాహారం అందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు సమయ పాలన ఉండగా ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి 11.30 నిమిషాలకు వరకు కుదించారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై టీచర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు సమయ పాలనను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.   

మరిన్ని వార్తలు