పెరగని భూగర్భ జలాలు

5 Oct, 2017 01:23 IST|Sakshi

భూగర్భ జల విభాగం నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్ ‌: సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఆగస్టు నెలలో 10 శాతం లోటు వర్షపాతం ఉందని రాష్ట్ర భూగర్భ జల విభాగపు నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 724 మిల్లీమీటర్లు కాగా కేవలం 647 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్‌ నెల భూగర్భ జల, వర్షపాత వివరాల నివేదికను భూగర్భజల విభాగం బుధవారం విడుదల చేసింది. భూగర్భ సగటు మట్టాలను పరిశీలిస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మట్టాల్లో పెద్దగా పెరుగుదల లేదని పేర్కొంది.

గత ఏడాది సెప్టెంబర్‌లో సగటు భూగర్భ మట్టం 8.95 మీటర్ల దిగువనే ఉండగా, ప్రస్తుతం అది 9.36 మీటర్ల మట్టంలో ఉందని తెలిపింది. గత ఏడాది మట్టాలతో పోలిస్తే 0.41మీటర్ల దిగువనే ఉందంది. గద్వాల, రంగారెడ్డి, మేడ్చల్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో భూగర్భమట్టాల్లో పెద్దగా పెరుగుదల లేదని తెలిపింది. అయితే ఆగస్టు నెలతో పోలిస్తే మాత్రం సెప్టెంబర్‌లో 0.77 మీటర్ల మేర పెరుగుదల ఉందని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 8 జిల్లాల పరిధిలో 0.03 మీటర్ల నుంచి 5.48 మీటర్ల వరకు మట్టాలు పెరిగాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు