కిరోసిన్‌ కట్‌

29 Jul, 2019 11:18 IST|Sakshi

 గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే  ఇక నుంచి బంద్‌ 

ఆగస్టు నుంచి కోత పెట్టనున్న ప్రభుత్వం

సాక్షి, మంచిర్యాలటౌన్‌(ఆదిలాబాద్‌) : పేదలకు సబ్సిడీపై రేషన్‌ దుకాణాల ద్వారా అందించే సరుకులను ఒక్కొక్కటిగా తగ్గి స్తున్నారు. గత ప్రభుత్వం 9 రకాల సరుకులు ఇవ్వగా.. ప్రస్తుతం ఒక్కొక్కటిగా కోత పెడుతూ వస్తున్నారు. ప్రస్తుతం బియ్యం, అంతంత మాత్రంగా అందిస్తున్న పంచదార, ఒక్కో కార్డుపై కేవలం ఒక లీటరు మాత్రమే ఇస్తున్న కిరోసిన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు నుంచి ఆంక్షలు విధించనున్నాయి. గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే కిరోసిన్‌ సరఫరా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు తగినట్లుగానే వచ్చే ఆగస్టు నెలలో కోటాను మూడోవంతు తగ్గించేశారు. గతంలోనే గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న కుటుంబాలకు నీలి కిరోసిన్‌ కోటాను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపం పథకం కింద కనెక్షన్‌ తీసుకున్న కుటుంబాలు, అసలు గ్యాస్‌ కనెక్షన్‌ లేని కుటుం బాలకు మాత్రమే ఆగస్టు నుంచి కిరోసిన్‌ పంపిణీ చేసేలా ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్‌ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఇస్తుండగా, కిరోసిన్‌ను సైతం సబ్సిడీపై ఇస్తుండడం ప్రభుత్వాలకు  భారంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 52 వేల లీటర్లు మాత్రమే..
మంచిర్యాల జిల్లాలో మొత్తం 423 రేషన్‌ దుకాణా లు ఉండగా, ఆహారభద్రత కార్డులు 2,01,147, అంత్యోదయ కార్డులు 15,079, అన్నపూర్ణ కార్డులు 189 మొత్తంగా జిల్లాలో 2,16,415 కార్డుదారులు ఉన్నారు. వీరికి గతంలో నెలకు 2.16 లక్షల లీటర్ల కిరోసిన్‌ అందించేవారు. ఇందులో గ్యాస్‌ క నెక్షన్‌ ఉన్నవారు 1,59,791 కుటుంబాలు ఉండగా, దీపం పథకం లబ్ధిదారులు 47,324 మంది ఉ న్నారు. వీరికి ప్రతినెలా సబ్సిడీతో కూడిన గ్యాస్‌ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తుంది. అయితే ప్రతినెలా కిరోసిన్‌ పంపిణీని ఆలస్యం చేయడం, ల బ్ధిదారులు సైతం కిరోసిన్‌ను తీసుకునేందుకు అం తగా ఆసక్తిని కనబర్చడం లేదు. దీంతో ప్రతి నెలా 30 వేలకుపైగా లీటర్ల కిరోసిన్‌ రేషన్‌ దుకాణాల్లో మిగులుగా ఉంటోంది.

బియ్యం, కిరోసిన్‌లను ప్ర తి నెలా లబ్ధిదారులకు ఈ–పాస్‌ విధానం ద్వారా నే అందిస్తున్నారు. అంటే లబ్ధిదారులు నేరుగా ఏదైనా రేషన్‌ దుకాణానికి వెళ్లి, వారి వేలిముద్రలు వేస్తేనే రేషన్‌ సరుకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. కొందరు లబ్ధిదారులు కిరోసిన్‌ను వాడడం పూర్తిగా వదిలేశారు. దీంతో ప్రతి నెలా కిరోసిన్‌ కోటా విడుదల అవుతున్నా, లబ్ధిదారులు మాత్రం గ్యాస్‌ కనెక్షన్‌ ఉండడంతో తీసుకునేందుకు అంతగా ఆసక్తిని కనబర్చడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న కుటుంబాలకు కిరోసిన్‌ను ఆగస్టు నుంచి పూర్తిగా నిలిపివేయనున్నారు. కిరోసిన్‌ను అత్యంత పేద కుటుంబాలకు మాత్రమే అందించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నీలి కిరోసిన్‌కు నల్ల బజారులో బాగా డిమాండ్‌ ఉండటంతో ఎక్కువ మంది దానిని వినియోగించకుండా దళారులకు విక్రయిస్తున్నారు.

దీనికి తోడు పెట్రోల్, డీజిల్‌లకు ప్రత్యామ్నయంగా ఉండడంతో చాలా వరకు పలువురు వాహనాలు, ఇతర యంత్రాల నిర్వహణకు వాడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీటర్‌ కిరోసిన్‌ను రూ.33కు రేషన్‌ దుకాణాల్లో విక్రయిస్తుండగా, బ్లాక్‌ మార్కెట్‌లో రూ.50 వరకు అమ్ముకుంటున్నారు. కిరోసిన్‌ను వంటకు వినియోగించకుండా, పలువురు వాహనాలను మరమ్మతుకు, జనరేటర్లు, ఇతర మోటార్లను నడిపేందుకు వినియోగిస్తున్నారు. ఇందుకోసం రేషన్‌ ద్వారా అందే సబ్సిడీ కిరోసిన్‌నే వాడుతున్నట్లుగా తెలు స్తోంది. దీంతో రేషన్‌ ద్వారా సబ్సిడీపై అందించే కిరోసిన్‌ పక్కదారి పట్టకుండా ఉండేందుకు గాను ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది.

గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే కిరోసిన్‌ ఇవ్వం
సబ్సిడీ కిరోసిన్‌ను పొందే కుటుంబాలకు ఎటువంటి గ్యాస్‌ కనెక్షన్‌ ఉండకూడదు. గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి ఆగస్టు నుంచి కిరోసిన్‌ సరఫరా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఆగస్టులో అందించే కిరోసిన్‌ కోటాను సైతం తగ్గించారు. గ్యాస్‌ కనెక్షన్‌ లేని పేదలకు మాత్రమే ఇకపై కిరోసిన్‌ ఇస్తాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి  

మరిన్ని వార్తలు