వర్షంతో ‘మధ్యాహ్న’ కలుషితం

16 Jul, 2018 08:36 IST|Sakshi
 బాలుర ఉన్నత పాఠశాలలో కిచెన్‌షెడ్డు లేక ఆరు బయట వంట చేస్తున్న దృశ్యం  

వికారాబాద్‌ అర్బన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక మధ్యాహ్న భోజనం కలుషితమవుతోంది. జిల్లాలోని సగానికిపైగా పాఠశాలల్లో వంట గదుల్లేవు. ఉన్న చోట ఇరుకుగా ఉండటంతో ఎజెన్సీలు ఆరుబయటే వంట చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో చాలా పాఠశాలల్లో రేకులతో చిన్న షెడ్లు వేసుకుని వంటలు చేస్తున్నారు. కొన్ని చోట్ల చెట్ల కింద, ఆరుబయటనే వంటలు చేస్తున్నారు. దీంతో వర్షపునీరు వంటల్లో పడి కలుషితమవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.

తరుచుగా ఇదే రకమైన ఆహారాన్ని ఏజెన్సీలు పెడుతుండడంతో విద్యార్థులు అనారోగ్యంబారినపడే అవకాశం ఉంది. వంట గదులు లేక పోవడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు కలుషిత ఆహారమే దిక్కవుతోంది. జిల్లాలో 778 ప్రాథమిక, 192 ప్రాథమికోన్నత, 290 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 96 వేలమంది విద్యార్థులు చదువుతున్నారు.

వీరందరికీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తోంది. జిల్లాలో సుమారు 1,330 ఏజెన్సీలు ఉన్నాయి. ఈ ఏజెన్సీలు ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేస్తున్నాయి.గతేడాది నుంచి అక్షయ పాత్ర సంస్థ మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తుండడంతో 262 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండడం మానేశారు.  

ఆరు బయట వంట.. 

జిల్లా వ్యాప్తంగా 140 పాఠశాలల్లో ఆరుబయటే వంట చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యాశాఖ అధికారులు జిల్లాలో సుమారు 140 పాఠశాలల్లో తక్షణం వంట గదులు నిర్మించేందుకు గతేడాది ప్రతిపాదనలు పెట్టారు. అయితే ఈ గదుల నిర్మాణానికి మాత్రం ఈజీఎస్‌నుంచి నిధులు మంజూరు చేస్తుందని, పనుల బాధ్యత కూడా ఆ సంస్థే చూస్తోందని ప్రభుత్వం తెలిపింది.

విద్యాశాఖ అధికారులు చూపించిన 140 పాఠశాలల్లో వంట గదులు నిర్మించేందుకు ముందుకొచ్చిన ఈజీఎస్‌ 300 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న చోట రూ.2లక్షలు, 300 మంది విద్యార్థులు దాటిన చోట రూ.2.5లక్షలు కేటాయించింది. ఈ మేరకు గత సంవత్సరం జూన్‌ మొదటి వారంలోనే సుమారు 140 పాఠశాలల్లో వంట గదుల నిర్మాణం పనులు చేట్టింది.

కాని ఇప్పటివరకు కేవలం 3 వంట గదుల నిర్మా ణం పనులే వందశాతం పూర్తైత ఉపయోగంలోకి వచ్చాయి. 118 వంట గదుల నిర్మాణం పనులు ఆయా దశల్లో కొనసాగుతున్నాయి. ఈజీఎస్‌లో చేపట్టే పనులకు సకాలంలో డబ్బులు రావనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకురావడంలేదు. ఈ కారణంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు రేకుల షెడ్డుల్లో, చెట్ల కింద వంటలు చేస్తున్నారు.  

మిగతావన్నీ ఇరుకుగదులే 

జిల్లా వ్యాప్తంగా ఉన్న 1120 వంట గదులు ఇరుకుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గదులు సుమారు పదేళ్ల కిందట నిర్మించినవి కావడంతో గదులు చిన్నగా ఉన్నాయి. దీంతో ఏజెన్సీలు ఈ గదులను ఉపయోగించడం లేదు. ఆగదులకు తలుపులు, కిటికీలు సక్రమంగా లేకపోవడంతో వాటిలో కనీసం సామగ్రి భద్రపర్చేందుకు కూడా ఉపయోగించడంలేదు.

కేవలం కట్టెలు, పాత సామగ్రిని దాచిపెడుతున్నారు. ముందుగా గుర్తించిన 140 పాఠశాలల్లో వంట గదుల నిర్మాణం తరువాత ఇరుకు గదులపై దృష్టి సారించాలని అధికారులు భావించారు. కాని మొదటి విడతనే ముందుకు సాగకపోవడంతో మిగతా వాటి నిర్మాణంపై ఉత్తిదే అనిపిస్తోంది.

మరిన్ని వార్తలు