అధికారులకు సెలవులు బంద్‌

16 Dec, 2016 04:34 IST|Sakshi
అధికారులకు సెలవులు బంద్‌

అసెంబ్లీ సమావేశాలపై సీఎస్‌ సమీక్ష
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే శాసన సభ, శాసనమండలి ఆరో విడత సమావేశాల సందర్భంగా సభ్యులడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా అధికారులు పర్యటనలు, సెలవుల్లో వెళ్లవద్దని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలపై గురువారం సచివాలయంలో సీఎస్‌ సమీక్ష జరిపారు.ఆ ప్రశ్నలపై ఆయా శాఖల కార్యదర్శులు హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకొని వెంటనే సమాధానాలు సిద్ధం చేయాలన్నారు.

ఈ నెల 21న మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో ఈ ప్రశ్న లకు రూపొందించిన వెబ్‌సైట్‌ను ప్రదర్శించారు. జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు వెంటనే పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం సమావేశాలకు అన్ని శాఖలు ముఖ్యమైన అంశాలతో ప్రత్యేక నోట్‌ను క్లుప్తంగా సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖల తరఫున సభలకు హాజరయ్యే అధికారులు తమకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు వెంటనే నోట్‌ చేసుకోవాలని, ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. వేరే శాఖలకు చెందిన ప్రశ్నలు వస్తే వాటిని సంబంధిత శాఖ అధికారులకు బదిలీ చేయాలని కోరారు. కార్యదర్శులు జిల్లాల పర్యటనకు వెళ్లి అభివద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని, కలెక్టర్లకు మార్గదర్శనం చేయాలని సీఎస్‌ సూచించారు. తమ శాఖ కార్యకలాపాలు జరిగే జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు

మరిన్ని వార్తలు