ఎరువులొచ్చాయి.. దించేందుకు లారీలేవి?

25 Jun, 2015 01:41 IST|Sakshi
ఎరువులొచ్చాయి.. దించేందుకు లారీలేవి?

లారీల సమ్మెతో తొలిరోజే తీవ్ర ప్రభావం
నిత్యావసరాల ధరలు భగ్గుమనే అవకాశం
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రులు

 
సాక్షి, హైదరాబాద్: లారీల సమ్మెతో.. తొలిరోజే తీవ్ర ప్రభావం కనిపించింది. నేరుగా ప్రజలపై పడకున్నా.. సరుకు రవాణ సంస్థలు, మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. సమ్మె ఇలాగే కొనసాగితే ప్రజలపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. జనాభా ప్రాతిపదికన త్రైమాసిక పన్నును తగ్గించాలని, రూ. 3 వేల నుంచి రూ. 5 వేలు తీసుకుని కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు మంజూరు చేయాలనే ప్రధాన డిమాండ్లతో తెలంగాణ లారీ యజమానుల సంఘం సమ్మెకు దిగిన తెలిసిందే. మంగళవారం రాత్రి ప్రభుత్వంతో చర్చలు విఫలం కావటంతో అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలైంది. దీంతో బుధవారం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 70 శాతం సరుకు రవాణ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముందస్తు బుకింగ్స్ నమోదైనవి మినహా ఎక్కడా సరుకుల లోడింగ్ జరగలేదు. పండ్లు, కూరగాయలు, పప్పులు, బియ్యంలాంటి నిత్యావసరాలు సహా సిమెంట్, ఎరువుల లోడింగ్, అన్‌లోడింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఊపందుకోవటంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు నిత్యం ఎరువులు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం న ల్లగొండ, మిర్యాలగూడ, ఖమ్మం, వరంగల్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, మూసాపేట స్టేషన్లకు భారీ పరిమాణంలో ఎరువుల లోడ్‌లో గూడ్సు వ్యాగన్లు చేరుకున్నాయి. కానీ వాటిలోంచి దించి, లోడ్ చేసేందుకు లారీలు లేకపోవటంతో వ్యాగన్లు అలాగే నిలిచిపోయాయి. ఈ విషయాన్ని అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తెచ్చారు.
 
 వారు మాట్లాడినా లారీల యజమానులు రాకపోవటంతో కలెక్టర్లు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో వ్యవసాయ పనుల నేపథ్యంలో ఎరువులను అత్యవసర వస్తువులుగా భావించి సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ అధికారులు లారీ యజమానుల సంఘాన్ని కోరారు. దీంతో కొన్ని చోట్ల ఎరువుల తరలింపునకు వారు సమ్మతించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌లలో మాత్రం ఏడు వేల టన్నుల ఎరువులు స్టేషన్లలోనే ఉన్నాయి.  మూసాపేటకు గోధుమలు, ఉప్పు లోడ్‌లతో కూడి వ్యాగన్లు కూడా వచ్చి నిలిచిపోయాయి. గురువారం నుంచి కూరగాయల దిగుమతి కూడా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. నిత్యం హైదరాబాద్‌కు 19వేల మిలియన్ టన్నుల కూరగాయలు వస్తాయి. గురువారం నుంచి దీనిపై ప్రభావం ఉంటుందని మార్కెటింగ్‌శాఖ ఆందోళన చెందుతోంది. ఇదే జరిగితే ఒక్కసారిగా కూరగాయల ధరలు కొండెక్కటం ఖాయం.
 
 లారీ యజమానులతో నేడు చర్చలు
 సమ్మె తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉండటంతో మంత్రులు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. త్రైమాసిక పన్నును తగ్గించాలనేది లారీ యజమానుల ప్రధాన డిమాండ్ కావటంతో దానిపై ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయనతో చర్చించని కారణంగా రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. కనీసం చర్చలకు కూడా ఆయన అందుబాటులో లేరు. ప్రస్తుతం సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఉండటంతో మంత్రి ఆయనతో భేటీ కాలేకపోయారు. గురువారం సీఎం నుంచి అందే ఆదేశం మేరకు లారీ యజమానుల సంఘాన్ని చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది. పన్ను తగ్గింపు లాంటి అర్థిక పరమైన అంశాలు మినహా మిగతా డిమాండ్లపై తాము సానుకూలంగా ఉన్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మె విరమించాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే సమ్మె విరమిస్తామని, చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని సంఘం అధ్యక్షులు భాస్కరరెడ్డి ఓ ప్రకటనలో  తెలిపారు.   
 

మరిన్ని వార్తలు