మీడియా ఇష్టారాజ్యం సహించం

10 Sep, 2014 02:06 IST|Sakshi
మీడియా ఇష్టారాజ్యం సహించం

వరంగల్‌: మీడియా స్వేచ్ఛ పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరూ అంగీకరించరని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయనతో పాటు స్పీకర్ మధుసూదనాచారి తదితరులు వరంగల్‌లో కాళోజీ విగ్రహానికి నివాళులర్పించే సమయంలో టీవీ9, ఏబీఎన్ సంస్థలకు చెందిన కొందరు నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

‘పత్రికా స్వేచ్ఛ హరి స్తోందని ఇయ్యాల కొందరు ప్లకార్డులు పట్టుకున్నరు. పత్రికలకు స్వేచ్ఛ ఉండవచ్చు. మీడియా సంస్థలు ప్రజాస్వామికంగా ఉంటే మీకా మర్యాద దొరుకుతది. ఆ రెండు చానళోళ్లు మళ్ల ఇయ్యాల తప్పు చేసిన్రు. స్పీకర్‌కు ఎదురుగా నల్ల జెండాలు జూపిన్రు. నేనంటే సీఎంని, కేసీఆర్‌కు వ్యతిరేకమైతే ఓకే. నన్ను చాలామంది తిట్టిన్రు. నేనేం భయపడలే. తెలంగాణ శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేస్తే వాళ్లు ఏం చూపిన్రు? తెలంగాణ రాష్ట్రానికి, శాసనసభకు వ్యతిరేకంగా చూపారు.

తెలంగాణ ఎమ్మెల్యేలను పాచికల్లు తాగే మొకాలంటే ఈ గడ్డ మీద క్షమించాల్నా? ఇది పత్రికా స్వేచ్చ అయితదా? ఏ మీడియా చెబుతది ఇది కరెక్టని? అనేకమంది త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఎమ్మెల్యేలు కొలువుదీరిన రోజు అదేనా పద్ధతి. పాతరేస్తాం జాగ్రత్త. కేసీఆర్‌ను తిడితే బాధలేదు. తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని, ఉనికిని, గౌరవాన్ని వ్యతిరేకించేలా ఎవడు చేసినా మెడలు విరిచి అవతల పారేస్తం. మీడియా ముసుగులో ఇడియట్ ఆటలు చేస్తామంటే సాగనివ్వం. అయినా ఈ చానళ్లను మేం బ్యాన్ చేయలే. ఈ అంశం స్పీకర్ వద్ద విచారణలో ఉంది.

అన్ని పార్టీలూ కలిసి శాసనసభలో తీర్మానం చేసి స్పీకర్‌కు అప్పగించాం. స్పీకరు నిర్ణయించాల్సి ఉంది. తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నా. దాన్ని పట్టుకుని ఢిల్లీల, ఇక్కడ, అక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఆంధ్రావాళ్లు చేసేది ఇదే. దీని గురించి బాధపడవద్దు. దీటుగా ఎదుర్కోవాలి. ఏదైనా ఉంటే మీడియా మిత్రులు నా వద్దకు రండి. ఆంధ్రావాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకోవద్దు’ అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు