ఏం జరుగుతోంది..

15 Feb, 2019 10:59 IST|Sakshi

ఎమ్మార్సీల్లో ఇష్టారాజ్యం 

రెగ్యులర్‌ ఎంఈఓలు లేక గాడి తప్పిన పర్యవేక్షణ 

ఫలితంగా పెత్తనం చెలాయిస్తున్న కొందరు ఉపాధ్యాయులు 

తరచూ వెలుగుచూస్తున్న అక్రమాలు 

గతంలో మిడ్జిల్, మరికల్‌.. ఇప్పుడు భూత్పూర్‌ 

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాలోని పలు మండలాల పరిధిలో విద్యాశాఖ అస్తవ్యస్థంగా మారింది. పూర్తిస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు లేకపోవడంతో పాఠశాలలు, ఎమ్మార్సీల్లో ఏం జరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది. ఎమ్మార్సీల్లో ఎంఈఓలతో పాటు సిబ్బంది కూడా లేని కారణంగా అక్కడ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన ఐదు మండలాల్లో ఇప్పటి వరకు ఎంఈఓ కార్యాలయాల ఏర్పాటు, ఎంఈఓలు, సిబ్బంది నియామకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అలాగే, జిల్లాలో కేవలం నలుగురు మాత్రమే రెగ్యులర్‌ ఎంఈఓలు విధులు నిర్వర్తిస్తుండగా.. మిగతా అన్ని చోట్ల సీనియర్‌ హెచ్‌ఎంలే ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఎంఈఓలు అటు పాఠశాలతో పాటు ఇటు కార్యాలయ విధులు చూసుకోవాల్సి ఉండడంతో దేనిపైనా పట్టు సాధించలేని పరిస్థితి నెలకొంది. 

ఇదే అదునుగా.. ఇన్‌చార్జి అధికారులతో మండల విద్యావ్యవస్థ కొనసాగుతుండడంతో పర్యవేక్షణ పూర్తిస్థాయిలో కొరవడింది. ఇదే అదునుగా ఎమ్మార్సీల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులు పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మార్సీల్లో బిల్లులు చేయడం, సర్వీస్‌బుక్‌ల నిర్వహణ తదితర అంశాలపై కొందరు ఎంఈఓలు కూడా ఉపాధ్యాయులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వారిని ఉపాధ్యాయులు తప్పుదోవ పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. 

వారిదే పెత్తనం 
మండల వనరుల కేంద్రా(ఎమ్మార్సీ)ల్లో బోధన సిబ్బంది పని చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఎమ్మార్సీల్లో క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లుతో పాటు అటెండర్లు మాత్రమే విధులు నిర్వర్తించాలి. అయితే, వీరి నియామకం లేకపోవడం.. ఒకవేళ ఉన్నా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై ఎంఈఓలు ఆధారపడుతుండడం గమనార్హం. కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి రికార్డులు, సర్వీస్‌పుస్తకాలు, బిల్లుల నిర్వహణపై అవగాహన లేదని చెబుతూ కొందరు ఎంఈఓలు ఉపాధ్యాయులను ఉద్దేశపూర్వకంగానే విధుల్లో నియమిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఉపాధ్యాయులు తామేది చెబితే అదే జరగాలన్న రీతిగా వ్యవహరిస్తూ ప్రతీ చిన్న పనికి చేతులు తడపాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, జిల్లాలోని 26 మండలాల్లో ఉన్న ఎమ్మార్సీల్లో నాలుగు మండలాలు మినహా చోట్ల 32 మందికిపైగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

భూత్పూర్‌ ఎంఈఓపై విచారణ 
ఇటీవల జిల్లాలోని భూత్పూర్‌ ఎంఈఓ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మండల ఎమ్మార్సీలో ఏటా విడుదలయ్యే నిధులకు సంబందించి గోల్‌మాల్‌ జరిగిందని.. నిధుల వినియోగానికి సంబందించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఓ వ్యక్తి ఐదు నెలల క్రితం ధరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా పలువురు ఉపాధ్యాయులు సెలవులపై వెళ్లినా వారికి వేతనం ఇచ్చారనే ఆరోపణలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే, దీనికి అక్కడి ఎమ్మార్సీలో పనిచేసే ఉపాధ్యాయుడే ప్రధాన సూత్రధారి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మిడ్జిల్, మరికల్‌ ఎంఈఓలపై కూడా ఆరోపణలు రావడం.. విచారణలో అవి నిజమేనని తేలడంతో అధికారులు అప్పట్లో చర్యలు తీసుకున్నారు. అక్కడ కూడా వ్యవహారం కూడా ఉపాధ్యాయుల కనుసన్నల్లోనే జరిగినట్లు ప్రచారం సాగింది. 

నివ్వెరపోవాల్సిందే... 
భూత్పూర్‌ ఎమ్మార్సీకి వచ్చిన నిధుల ఖర్చు వివరాలను ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా సేకరించారు. ఈ మేరకు సెల్‌ఫోన్‌ కొనేందుకు రూ.8వేలు, ఇంటర్నెట్, ఫోన్‌ బిల్లుకు రూ.14,391, తాగునీటి కోసం రూ.3,200, జిరాక్స్‌ కాపీలకు రూ.6వేలు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఇక బ్యాటరీ మరమ్మతుకు రూ.5వేలు, సమావేశాల నిర్వహణ ఖర్చులుగా రూ.8వేలు, కంప్యూటర్‌ మరమ్మతుకు రూ.7వేలు, విద్యుత్‌ బిల్లులు రూ.7,500, ఫ్యాన్ల మరమ్మతుకు రూ.6వేలు, ఎఫ్‌టీఏ, ఎంవీడబ్ల్యూకు రూ.12వేలు, దినపత్రికలకు రూ.3వేలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇవన్ని కూడా సత్యదూరంగానే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. కాగా, భూత్పూర్‌ మండలం మిత్యాతండాకు పాఠశాలకు గత ఆగస్టులో ఓ ఉపాధ్యాయురాలు విధులకు రాకుండా ఆయాతో పాఠాలు చెప్పించారని పత్రికలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై విచారణ జరిపించిన అధికారులు నివేదిక వచ్చినా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఆరోపణలతో తాజాగా భూత్పూర్‌ ఎంఈఓపై విచారణకు ఆదేశించారు. 

కొరవడిన పర్యవేక్షణ 
జిల్లాలో నాలుగు మండలాలు మినహా మొత్తం మండలాల్లో సీనియర్‌ హెచ్‌ఎంలు ఎంఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. కొత్త ఐదు మండలాల్లో అసలు కార్యాలయాలే లేవు. అక్కడ సిబ్బంది నియామకంపై ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్‌ నఅధికారులు మండలంలోని పాఠశాలల్లో ఏం జరుగుతుందన్న విషయంపై పెద్దగా శ్రద్ధ వహించడం లేదు. అటు సొంత పాఠశాలలతో పాటు ఇటు మండలంలోని పాఠశాలల్లో ఏం జరుగుతుందన్న విషయమై పరిశీలన జరపాలి. ఉపాధ్యాయుల హాజరు, నాణ్యమైన విద్య, సమయ పాలన, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను పర్యవేక్షించాల్సి ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, పనిభారంతోనే తాము రెండు అంశాలపై దృష్టి సారించలేకపోతున్నామనేది ఇన్‌చార్జిల వాదనగా ఉంది. ఈ మేరకు సర్వీస్‌ రూల్స్‌ అమలు చేసి, రెగ్యులర్‌ ఎంఈఓలను నియమిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు చెబుతున్నారు. 

అక్రమాలు తేలితే కఠిన చర్యలు
ఎమ్మార్సీల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించాం. ఇటీవల భూత్పూర్‌ ఎంఈఓపై ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించాం. ఆరోపణలు నిజమేనని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రెగ్యులర్‌ ఎంఈఓల నియామకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య, అలాగే, ఎమ్మార్సీల్లో ఉపాధ్యాయులెవరూ విధులు నిర్వహించొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. 
సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి 

సర్వీస్‌ రూల్స్‌ అమలుతోనే పరిష్కారం 
ప్రభుత్వం సర్వీస్‌ రూల్స్‌ను అమలు చేయకపోవడంతో ఎంఈఓల నియామకం పెద్ద సమస్యగా మారింది. సర్వీస్‌రూల్స్‌ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి, పూర్తి స్థాయిలో రెగ్యులర్‌ ఎంఈఓల నియామకం చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే, ఎమ్మార్సీల్లో ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ను కూడా నియమించాలి. తద్వారా ఉపాధ్యాయులు ఎవరూ పని చేయాల్సిన అవసరం ఉండదు.. 
గట్టు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ 

ఇన్‌చార్జ్‌ ఎంఈఓలపై భారం 
జిల్లాలో చాలా మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వీరు పాఠశాలలకు హెచ్‌ఎంలుగా ఉంటూ, ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. సొంత పాఠశాలతో పాటు మండలంలోని మిగతా పాఠశాలలను కూడా పర్యవేక్షించాలి. ఇది పెనుభారంగా మారింది. రెగ్యులర్‌ ఎంఈఓలను నియమించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 
 – సతీష్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు, టీఎస్‌టీయూ  

మరిన్ని వార్తలు