యూరియా.. రైతుపై లేదు దయ

13 Feb, 2018 05:10 IST|Sakshi

జిల్లాల్లో దళారులు, కంపెనీల ప్రతినిధులు, అధికారుల దందా 

కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న వైనం 

బస్తా ధర రూ.295.. రైతుకు మాత్రం రూ.350 

అదనంగా రూ.50 వరకు భారం..

 రైతుల బెంబేలు.. పట్టించుకోని వ్యవసాయ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: ఇలా రాష్ట్రవ్యాప్తంగా యూరియా దందా నడుస్తోంది. ఎరువుల డీలర్లు, అధికారులు, కంపెనీల ప్రతినిధులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి రైతు నోట్లో మట్టి కొడుతున్నారు. రూ.లక్షలు బొక్కేస్తున్నారు. 50 కిలోల యూరియా బస్తా గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) రూ.295 మాత్రమే. ఆ యూరియా బస్తాను దుకాణదారులకు రూ.265కు ఇవ్వాలి. కానీ దళారులు, అధికారులు, కంపెనీల ప్రతినిధులు సిండికేటుగా ఏర్పడి ఎరువుల దుకాణదారులకు అధిక ధరలకు అంటగడుతున్నారు. దీంతో దుకాణాదారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. తగినంతగా యూరియా సరఫరా కావటం లేదని, కంపెనీలు పంపడంలేదని రైతులకు చెబుతున్నారు. యూరియాతోపాటు, కాం ప్లెక్స్‌ ఎరువుల పరిస్థితి కూడా అలాగే ఉందని ప్రచారం చేస్తున్నారు. 

కొరత లేదు.. కానీ.. 
రబీ అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31,92 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 27.07 లక్షల (85%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 15 లక్షల (98%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. సాగు ఊపందుకోవడంతో యూరియాకు డిమాండ్‌ ఏర్పడింది. రబీలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 5.8 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించింది. అందులో ఇప్పటివరకు 3.59 లక్షల మెట్రిక్‌ టన్నులు జిల్లాలకు ఇవ్వాల్సి ఉండగా, 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులను అందజేసింది. ఇదిగాక పాత యూరియా 1.69 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇప్పటికే అందుబాటులో ఉంది. మొత్తంగా 4.19 లక్షల టన్నులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే ప్రస్తుత లక్ష్యానికి మించి యూరియా అందుబాటులో ఉంది. ఇందులో మార్క్‌ఫెడ్‌ 1.07 లక్షల మెట్రిక్‌ టన్నులు, మిగిలినవి వ్యవసాయ శాఖ ద్వారా వివిధ కంపెనీలు జిల్లాలకు సరఫరా చేశాయి. ఇంత అందుబాటులో ఉన్నా సరఫరా వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దందాలు మొదలయ్యాయి.  

కమీషన్లకు కక్కుర్తి.. 
మార్క్‌ఫెడ్‌ నుంచి ప్రాథమిక సహకార సంఘాలు, దాని లైసెన్సుదారుల ద్వారా యూరియా సరఫరా కావాలి. వ్యవసాయశాఖ అనుమతి మేరకు కంపెనీల నుంచి ఎరువుల డీలర్లకు సరఫరా కావాలి. మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులే సరఫరాలో కీలకం కావడంతో వారే కృత్రిమ కొరత సృష్టించి కమీషన్లు ఇచ్చిన వారికే సరఫరా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో యూరియాను నల్ల బజారుకు తరలిస్తున్నారు. కింది నుంచి పైస్థాయి వరకు దందాలు జరుగుతుండటం, ముడుపులు తీసుకుంటుండటంతో ఎవరూ నోరు మెదపడంలేదు. 

ఖమ్మం జిల్లా మార్క్‌ఫెడ్‌కు చెందిన అధికారి ఒకరు ఎరువుల దుకాణాలకు అక్రమంగా యూరియా సరఫరా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అలా సరఫరా చేసినందుకు ఒక లారీకి రూ.10 వేల చొప్పున కమీషన్‌ వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. అలాగైతేనే యూరియా సరఫరా చేస్తానని బెదిరిస్తున్నారంటూ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఆ కమీషన్‌ ప్రభావం రైతులపై పడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఒక కీలకమైన ఎరువుల కంపెనీకి సంబంధించిన ఆ జిల్లా ప్రతినిధి ఒకరు యూరియాను కమీషన్లు తీసుకొని దళారులకు అప్పగిస్తున్నాడు. ఆ దళారీ దుకాణాలకు అధిక ధరలకు అమ్ముకుంటున్నాడు. 

ఈయన పేరు కట్ల రాంబాబు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చెర్ల గ్రామానికి చెందిన రైతు. దుకాణాల్లో యూరియా బస్తా రూ.330 నుంచి రూ.340 వరకు విక్రయిస్తున్నారని తెలిపాడు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పైగా నాణ్యతలేని, నిల్వ చేసిన యూరియాను విక్రయిస్తున్నారని రాంబాబు చెప్పాడు. 

మిర్యాలగూడకు చెందిన రైతు టి.వెంకటయ్య బస్తాను రూ.350కు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఇదేమని అడిగితే ఎరువుల దుకాణదారులకే రూ.320కు వస్తుందని చెబుతున్నారని, లాభం వేసుకొని రూ.350కు బస్తా ఇచ్చినట్లు వివరించాడు. 

తప్పని పరిస్థితిలో కొన్నా
నాగార్జున సాగర్‌ నీటిని ఆరుతడి పంటలకు విడుదల చేయటంతో రెండెకరాల్లో వేరుశనగ వేశా. అందుకోసం ఒక్కో బస్తా యూరియా రూ.330 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చింది. అసలు ధర రూ.295 కాగా ఎందుకింత ధర అని వ్యాపారిని ప్రశ్నిస్తే.. రవాణా చార్జీలు ఉంటాయని చెప్పాడు. దీంతో తప్పని పరిస్థితిలో రూ.330కు యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చింది. 
– బుంగ లింగయ్య, వందనం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా 

మరిన్ని వార్తలు