మంత్రి ఇలాఖా.. కాలేజీ ఇలాగా?

2 Aug, 2018 02:01 IST|Sakshi
కళాశాల గదిలో నేలపై కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థులు

తాండూరు: అది మంత్రి ఇలాఖా. అక్కడ ఓ జూనియర్‌ కాలేజీ ఉంది. 1950లో ఏర్పాటైన ఆ కళాశాల దినదిన ప్రవర్థమానమై రెండు వేలకుపైగా విద్యార్థులతో కళకళలాడుతోంది. ఇక్కడ 25 మంది అధ్యాపకులు ఉన్నారు. వారిలో ఒక్కరే ప్రభుత్వ అధ్యాపకుడు. మిగతావారంతా కాంట్రాక్ట్‌ లెక్చరర్లే. బెంచీలు సరిపడా లేక చాలా మంది కింద కూర్చొనే పాఠాలు వింటున్నారు. ఇరుకు గదుల్లో విద్యార్థులు కిక్కిరిసిపోతున్నారు.

ఇదీ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోని జూనియర్‌ కళాశాల దుస్థితి. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు కాలేజీలో 2,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో సెక్షన్‌లో 180 మంది విద్యార్థులున్నారు. వీరికి సరిపడా తరగతి గదులూ, బెంచీలూ లేవు. కింద కూర్చున్న వారికి బోర్డు కనిపించకపోవడంతో అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థం కావడం లేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా జూనియర్‌ కళాశాల విద్యకు గ్రహణం వీడలేదు. ప్రభుత్వ కళాశాలలను మరింత బలోపేతం చేశామని అధికారులు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు. గుణాత్మక విద్య అందడం లేదు. కాలేజీ దుస్థితిపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు