మందుల ప్రకటనలు ఇక బంద్‌!

5 Feb, 2020 05:26 IST|Sakshi

78 రకాల జబ్బుల ఔషధ ప్రచారంపై కేంద్రం నిషేధం

డ్రగ్స్, మ్యాజిక్‌ రెమిడీస్‌ సవరణ ముసాయిదా బిల్లు 

సాక్షి, హైదరాబాద్‌: టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాలు, కరపత్రాలు, ఆడియో, వీడియో తదితర పద్ధతుల్లో ఇచ్చే ఔషధ ప్రకటనల ప్రచారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన సవరణ ముసాయిదా బిల్లును రూపొందించింది. ఆ బిల్లును మంగళవారం ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని రకాల జబ్బులకు సంబంధించిన మందులను ప్రచారం చేయకూడదన్న నిబంధన ఉండగా, తాజాగా మరికొన్నింటినీ కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 78 రకాల జబ్బులకు ఫలానా మందు వాడితే తగ్గుతుందంటూ ప్రకటనలు చేయకూడదని, ఆ మేరకు ముసాయిదా బిల్లులో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా ఆ జబ్బులకు మందులను సూచిస్తూ ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తామని తెలిపింది.

మళ్లీ అదే తప్పు చేస్తే ఐదేళ్ల జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనను కేంద్రం ముసాయిదాలో ప్రవేశపెట్టింది. ఈ జబ్బుల జాబితాలో ఎయిడ్స్, క్యాన్సర్, డయాబెటిస్, డిజార్డర్స్, హెర్నియా, హైడ్రోసిల్, బ్రెయిన్‌ సామర్థ్యాన్ని పెంచడం, లుకేమియా, స్థూలకాయం, పక్షవాతం, పార్కిన్‌సన్, పైల్స్, గుండె జబ్బులు, లైంగిక సామర్థ్యం, కిడ్నీలో రాళ్లు, లెప్రసీ, ప్లేగ్, న్యుమోనియా, టీబీ, టైఫాయిడ్‌ ఫీవర్, అపెండిసైటిస్, అంధత్వం, బ్లడ్‌ పాయిజనింగ్, చెవుడు, స్కిన్‌ ఫెయిర్‌నెస్, కంటి చూపు పెంపుదల, కామెర్లు, స్పాండిలైటిస్, మహిళలకు వచ్చే కొన్ని రకాల వ్యాధులు, అల్సర్లు తదితర జబ్బులకు మందులు సూచించకూడదని ముసాయిదా తెలిపింది. ఇలాంటి ప్రకటనల వల్ల చాలామంది డాక్టర్లను సంప్రదించకుండానే నే రుగా మందుల షాపుల్లో కొని వాడుతున్నారు. దీంతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయి. దీనికి చెక్‌ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు