కొత్త కార్డులు లేనట్లే..!

24 Dec, 2014 08:40 IST|Sakshi
కొత్త కార్డులు లేనట్లే..!

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతవకలు అరికట్టడం,  బోగస్‌రేషన్ కార్డుల ఏరివేత లక్ష్యంగా ఆహార భద్రత కార్డులు(ఎఫ్‌ఎస్‌సీ) జారీచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 10వ తేదీ నుంచి సుమారు 20రోజుల పాటు క్షేత్రస్థాయిలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 10.80లక్షల మంది ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక పింఛన్లు, ఆహార భద్రత కార్డుల కోసం కుప్పలుగా దరఖాస్తులు రావడం తో కొత్త రేషన్‌కార్డుల(ఎఫ్‌ఎస్‌సీ) జారీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు. సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో ఆహార భద్రత కార్డుల జారీపై దృష్టి సారించారు. కాగా, 2015 జనవరి 1వ తేదీన నాటికి కొత్తకార్డులు జారీ చేయడంతో పాటు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.
 
 గడువు సమీపిస్తున్నా ఆహార భద్రత కార్డులకు అర్హులను తేల్చడంలో అధి కార యంత్రాంగం విఫలమైంది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయినా వివరాలు కంప్యూటరీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇప్పటివరకు 10.71 లక్షల దరఖాస్తుల పరిశీలన (99.14శాతం) పూర్తి చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వాటిలో 30 శాతం లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఆహారభద్రత కార్డులకు అర్హుల
 సంఖ్య స్పష్టమవుతోంది.
 
 కార్డల సంఖ్యలో కోత?
 ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో 9,85,557 కుటుంబాలుగా తేల్చారు. అయితే వివిధ కేటగిరీల కింద పౌరసరఫరాల శాఖ అధికారులు 11,73,988 రేషన్‌కార్డులు జారీచేశారు. ఈ నేపథ్యంలో బోగస్ కార్డులను తొలగిస్తూ వాటి స్థానంలో ఆహారభద్రత కార్డులు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు దరఖాస్తుల పరిశీలన, కంప్యూటరీకర ప్రక్రియ పూర్తయితే కార్డుల సంఖ్యలో భారీగా కోత పడనుంది. కార్డులు, యూనిట్ల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గడంఖాయమని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ‘సాక్షి’కి సూచనప్రాయంగా వెల్లడించారు.
 
 గతంలో ఒక్కోయూనిట్‌కు రూపాయికి కిలో చొప్పున నాలుగు కిలోల బియ్యాన్ని పంపిణీ చేసేవారు. ప్రస్తుతం యూనిట్ కు ఆరు కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కార్డుల జారీప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో పాత కార్డులపైనే యూనిట్‌కు ఆర కిలోల చొప్పున ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీంతో గతంలో ఉన్న కార్డులు, యూనిట్ల సంఖ్య ఆధారంగానే జనవరి కోటాకు సంబంధించి డీలర్ల నుంచి డీడీలు తీసుకుంటున్నారు. జనవరి కోటాకు సంబంధించి 2310 మం డీలర్లలో 1572 మంది డీడీలు సమాచారం. నెలాఖరులోగా ఆహారభద్రత కార్డల దరఖాస్తులను కంప్యూటరీకరించి అర్హుల సంఖ్యను తేల్చుతామని జిల్లా పౌరసరఫరాల అధికారి సయ్యద్  యాసీస్ ‘సాక్షి’కి వెల్లడించారు.

మరిన్ని వార్తలు