పాడె మోసేందుకూ ముందుకు రాలేదు

13 Jul, 2020 08:26 IST|Sakshi
ఎడ్లబండిపై జానయ్య మృతదేహాన్ని పెట్టుకొని బండిని లాగుతూ అంతిమయాత్ర నిర్వహిస్తున్న కుటుంబీకులు  

సాక్షి, శాలిగౌరారం: ‘కరోనా’అనుమానం మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని మంటగలిపింది. అనారోగ్యంతో మృతిచెందిన ఓ వ్యక్తి దహన సంస్కారాలకు ఒక్కరూ ముందుకు రాలేదు. పాడె మోసేందుకు కూడా బంధువులు ముందుకు రాకపోవడంతో.. ఎడ్లబండే ఆ కుటుంబానికి ఆధారంగా మారింది. అయితే ఆ బండిని లాగేందుకు ఎడ్లు కూడా లేకపోవడంతో మృతుడి ఇద్దరు బావలే ఎడ్లుగా మారారు.. తమ్ముడు వెనకాల ఎడ్లబండిని నెట్టాడు. హృదయ విదారక పరిస్థితుల్లో వారు దహన సంస్కారాలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచి్చంది. వివరాలిలా ఉన్నాయి.. ఆకారం గ్రామానికి చెందిన మర్రిపల్లి నర్సయ్య, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు జానయ్య (32) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన జానయ్యను ‘కరోనా’అనుమానంతో ఈనెల 9న నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. జానయ్య నుంచి నమూనాలను సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. 10న రాత్రి జానయ్య మృతి చెందాడు. వైద్య పరీక్షల నివేదికలు రానప్పటికీ మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చి ఆస్పత్రి వైద్య సిబ్బంది జానయ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయతి్నంచగా కరోనా అనుమానంతో బంధువులు, గ్రామస్తులు దహన సంస్కారాలకు వచ్చేందుకు నిరాకరించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో మృతుడి కుటుంబీకులే మృతదేహన్ని ఖననం చేసేందుకు గుంత తీసుకున్నారు.

ఎడ్లబండిపై జానయ్య మృతదేహాన్ని పెట్టుకుని వెళ్లి అంతిమ సంస్కారం నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎడ్లబండికి మృతుడి ఇద్దరు బావలే ఎడ్లుగా మారగా తమ్ముడు బండిని వెనకనుంచి నెట్టుతూ తీసుకెళ్లారు. చివరకు మృతుని పొలం వద్ద అంత్యక్రియలను పూర్తిచేశారు.

మరిన్ని వార్తలు