నిజాయితీని ఎవరూ గుర్తించడం లేదు

1 Jan, 2015 00:41 IST|Sakshi
నిజాయితీని ఎవరూ గుర్తించడం లేదు

జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన
ఆయనకు హైకోర్టు ఘన వీడ్కోలు

 
సాక్షి, హైదరాబాద్: జనవరి 7న పదవీ విరమణ చేయనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్‌కు హైకోర్టు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది. గురువారం నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడంతో ఆయనకు బుధవారమే హైకోర్టు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం లో జస్టిస్ చంద్రకుమార్ కుటుంబ సభ్యులు, ఇరు రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, పి.వేణుగోపాల్, రిజిస్టార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ న్యాయవ్యవస్థకు అందించిన సేవలను ఇరువురు ఏజీలు కొనియాడారు. తరువాత జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... ఇన్నేళ్ల తన న్యాయ ప్రస్థానంలో తనకు సహకరించిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేశారు. సమాజంలో రోజు రోజుకు డబ్బుకు ప్రాధాన్యత పెరిగిపోతూ, విలువలు నశించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీని, కష్టపడే తత్వాన్ని సమాజంలో గుర్తించడం లేదన్నారు.

రోజు రోజుకు నిజాయితీ అన్నది అరుదుగా వినిపించే పదంగా మారిపోతుందని చెప్పారు. మానవ హక్కుల పరిరక్షణలో న్యాయవాదులు కీలక పోత్ర పోషించాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు కేసులు చేస్తున్న తీరును చూసి జూనియర్ న్యాయవాదులు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చునని, ఆ దిశగా జూనియర్ న్యాయవాదులు దృష్టి సారించాలని హితవు పలికారు. పదవీ విరమణ తరువాత కూడా తాను ప్రజల్లో న్యాయ అవగాహన కోసం పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తరువాత జస్టిస్ చంద్రకుమార్‌ను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది.

మరిన్ని వార్తలు