చెత్తకు చెక్‌!

25 Oct, 2019 10:34 IST|Sakshi
పద్మారావునగ్‌లోని ఎల్లమ్మ టెంపుల్‌ వద్ద...

ఓపెన్‌ గార్బేజ్‌ పాయింట్ల తొలగింపు  

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా బల్దియా చర్యలు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఇటీవల కాలంలో ఏర్పడిన ఓపెన్‌ గార్బేజ్‌ పాయింట్లను తొలగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్న చెత్తను పూర్తిగా తొలగించి, తిరిగి అక్కడ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోనుంది. ఇందుకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమించడం, ఆయా ప్రదేశాల్లో ముగ్గులు వేయడం, మొక్కలు నాటడం తదితర పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లు, మెడికల్‌ ఆఫీసర్లను ఆదేశించారు. నగరంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త భారీ ఎత్తున్న పోగవుతున్నవి దాదాపు 1,116 ప్రాంతాలున్నట్లు జీహెచ్‌ఎంసీ గతంలోనే గుర్తించింది. వల్నరబుల్‌ గార్బేజ్‌ పాయింట్స్‌గా గుర్తించిన వీటిని పూర్తిగా తొలగించేందుకు బల్దియా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేయడంతో సమస్య తీరింది. అయితే వరుస పండగలు రావడం, భారీ వర్షాలు కురవడంతో తొలగించిన ఈ గార్బేజ్‌ పాయింట్లలో సగానికి పైగా తిరిగి ఏర్పడ్డాయి. ముఖ్యంగా చౌరస్తాలు, ప్రధాన కూడళ్లు, కమర్షియల్‌ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, తిరిగి చెత్త వేస్తే జరిమానాలు విధించాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఓపెన్‌ గార్బేజ్‌ పాయింట్లను పూర్తిగా తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. 

ఇదీ ప్రణాళిక...  
స్వచ్ఛ ఆటో టిప్పర్ల ద్వారా ఇంటింటి నుంచి చెత్తను మరింత సమర్థవంతంగా సేకరించడం.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి భారీ జరిమానాలు విధించడం, హెచ్చరికలతో బ్యానర్లు ప్రదర్శించడం.
దుకాణాదారులు, వ్యాపారస్తులు విధిగా చెత్తను ఆటో టిప్పర్లలోనే వేసే విధంగా అవగాహన కల్పించడం.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిని గుర్తించి వారికి సన్మానం చేసి, వారిలో మార్పు తెచ్చేందుకు కృషి చేయడం.  
ఈ పాయింట్లలో చెత్త వేయకుండా నివారించేందుకు స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, వ్యాపార సముదాయాల యజమానులతో మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించడం.  
పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది కార్పొరేటర్లు, కాలనీ సంఘాలు, బస్తీ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయడం.  
చెత్తను తొలగించిన తర్వాత తిరిగి ఆయా ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా ముగ్గులు వేయడం, బ్యానర్లు ప్రదర్శించడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, జరిమానా విధించడం లాంటి చర్యలు చేపట్టడం.  
కాలనీల్లో స్థానిక రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవడం.   
ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లోనూ గార్బేజ్‌ను పూర్తిగా తొలగించడం.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా