తొలిరోజు సందడి లేని ఎంజీబీఎస్‌

29 May, 2020 10:37 IST|Sakshi
శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్న ప్రయాణికురాలు , ప్లాట్‌ఫాం వద్ద సిద్ధంగా ఉన్న ఆర్టీసీ బస్సులు

బస్సులను ఎంజీబీఎస్‌లోకి అనుమతించినా కానరాని జనం

తొలిరోజు 250 బస్సుల రాకపోకలు

అఫ్జల్‌గంజ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు 58 రోజులపాటు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు గత వారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. అయితే బస్సులను నగర శివారు ప్రాంతాలకే పరిమితం చేశారు. తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్‌ (ఎంజీబీఎస్‌)లోకి అనుమతిచ్చారు. ఈ క్రమంలో తొలిరోజు గురువారం దాదాపు 250 బస్సులు వివిధ జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు రాకపోకలు సాగించాయి.

వీటి ద్వారా సుమారు పది వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని ఎంజీబీఎస్‌ సహాయ మేనేజర్‌ సుధ తెలిపారు. ఎంజీబీఎస్‌ ప్రాంగణంలో ఉన్న మూత్రశాలల వద్ద, సమాచార కేంద్రం వద్ద పెడల్‌ శానిటైజర్‌ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బస్సును శానిటైజ్‌ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నామని వెల్లడించారు. బస్సు ఎక్కే ముందు డ్రైవరు, కండక్టర్‌తో సహా ప్రయాణికులందరూ తమ చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని... భౌతిక దూరాన్ని పాటిస్తూ బస్సులను ఎక్కి నిర్దేశించిన సీట్లల్లో మాత్రమే కూర్చొని ప్రయాణించాలని ఆమె సూచించారు.

మరిన్ని వార్తలు