పింఛన్ వస్తదో.. రాదో..!?

30 Jul, 2014 00:15 IST|Sakshi
పింఛన్ వస్తదో.. రాదో..!?

భువనగిరి  :జిల్లాలోని భువనగిరి డివిజన్‌లో వేలాది మంది మహిళలు బీడీ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వారంతా గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఇవ్వనున్న పింఛన్ లిమిటెడ్ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకేనా..? లోకల్ కంపెనీల్లో పనిచేసే వారికి వర్తిస్తుందా.. లేదా.. అన్న అనుమానం వారిని వేధిస్తోంది. లిమిటెడ్ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను ఆయా కంపెనీ యాజమాన్యాలు వేగంగా సేకరిస్తుం డడం, అన్ లిమిటెడ్ కంపెనీలు ఆ పని చేయకపోవడంతో అనుమానం మరింత పెరుగుతోంది. దీర్ఘకాలంగా పొగాకుతో పనిచేయడం వల్ల శ్యాసకోస, క్షయ, టీబీ, కంటి జబ్బులు, రక్తహీనత వంటి వ్యాధులతో అవస్థలు పడుతున్నారు.  అయినా కంపెనీ యాజమాన్యాలు, కార్మిక శాఖ అధికారులు చాలా మందికి గుర్తింపుకార్డులు అందించలేదు. గుర్తిం పుకార్డులు లేని వారికి పింఛన్ రాదంటే తమకు తీరని నష్టం వాటిల్లినట్లేనని లోకల్ బీడీ పరిశ్రమల కార్మికులు వాపోతున్నారు.     
 
 డివిజన్‌లో 20 పరిశ్రమలు
 భువనగిరి డివిజన్‌లో సుమారు 20 వరకు చిన్న, పెద్ద బీడీ పరిశ్రమలు ఉండగా వీటిలో నాలుగు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న 16 కంపెనీల్లో సుమారు 3వేల మంది పనిచేస్తున్నారు.  భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం తదితర మండలాల్లో బీడీ కార్మికుల సంఖ్య అధికంగా ఉంది. అయితే ఈ డివిజన్‌లో ఉన్నవన్నీ అన్ లిమిటెడ్ కంపెనీలు కావడంతో కార్మికులు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదు.
 
 గుర్తింపు కార్డులుంటేనే..
 బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న పలు కార్మిక కుటుంబాలు ఇప్పటికే  కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నాయి.   పీఎఫ్, పెన్షన్, వైద్య సౌకర్యం, గృహ నిర్మాణంతోపాటు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతున్నాయి. అయితే ఇవన్నీ కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చే గుర్తింపుకార్డులు, చెల్లించే పీఎఫ్‌పైనే ఆధారపడి ఉంటాయి. గుర్తింపు కార్డులు ఉన్నవారు ఒక్కో కంపెనీలో 10 మందికి మించి లేరని తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు