మాది 1949 నుంచీ పట్టా భూమే

2 Jul, 2014 02:13 IST|Sakshi
మాది 1949 నుంచీ పట్టా భూమే

* ప్రభుత్వ రికార్డులే ఈ విషయాన్ని చెబుతున్నాయి
* హైకోర్టుకు ఎన్ కన్వెన్షన్ యజమానుల నివేదన
* నోటీసివ్వకుండా చర్యలు తీసుకోవటం సరికాదు
* ఎన్ కన్వెన్షన్ తరఫు న్యాయవాది వాదనలు
* ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలకు అనుమతి లేదు
* టీ-సర్కారు తరఫున ఏజీ వాదనలు
* నేడు కోర్టు ఉత్తర్వులు.. అప్పటివరకూ యథాతథస్థితే
 
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించిన స్థలం 1949 నుంచీ పట్టా భూమిగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉందని సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం కోర్టుకు నివేదించారు. తమ భూమిపై ఇప్పటివరకు ఎటువంటి వివాదాలు లేవని, చెరువును అనుకుని నిర్మాణం ఉందన్న ఏకైక కారణంతో చెరువును ఆక్రమించుకున్నామని చెప్పడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. తమ భూమిని సర్వే చేయాలని అధికారులు భావిస్తే వారికి సహకరిస్తామని వివరించారు.

ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లిమిట్స్)ను నిర్ణయించడం, మార్కింగ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించామని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు కన్వెన్షన్ సెంటర్‌లోని నిర్మాణాలను మార్కింగ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఎన్‌కన్వెన్షన్ యజమాని, సినీ నటుడు అక్కినేని నాగార్జున, దాని లీజుదారు ఎన్3 ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి నల్లా ప్రీతమ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

వీటిపై సోమవారం విచారణ జరిపి, ఈ మొత్తం వ్యవహారంలో యథాతథస్థితి కొనసాగించాలని అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, ఈ వ్యాజ్యాలపై మంగళవారం కూడా వాదనలు విన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం, న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిలు వాదనలు వినిపించగా.. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లోని నిర్మాణాల విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఇదే హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులు ఇంకా అమలులోనే ఉన్నాయని శ్రీరఘురాం కోర్టుకు నివేదించారు.

తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ ఏరియా కేవలం 18.28 ఎకరాలు మాత్రమేనని హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో ప్రభుత్వమే పేర్కొందని ఆయన తెలి పారు. అధికారులు మాత్రం 29.24 ఎకరాలను ఎఫ్‌టీఎల్ కింద పరిగణిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. నిర్దిష్ట విధి విధానాలను పాటించకుండా ఏకపక్షంగా ఎఫ్‌టీఎల్ నిర్ణయించడం, మార్కింగ్ చేయడం సరికాదని మరో న్యాయవాది నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లోని భవనాలకు మార్కింగ్ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధించుకుంది.

చెరువుల పరిరక్షణ నిమిత్తం చర్యలు తీసుకోవాలంటూ లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగానే జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్ కన్వెన్షన్ లోనికి వెళ్లి తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ను పరిశీలించారని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కొండం రామకృష్ణారెడ్డి కోర్టుకు నివేదించారు. అధికారులది కేవలం పరిశీలనేనని, అందులో భాగంగానే మార్కింగ్ చేసి ఎఫ్‌టీఎల్‌ను అంచనా వేసే ప్రయత్నం చేశారన్నారు. ఒకవేళ జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని భావిస్తే, విధివిధానాలకు లోబడి, ఎన్ కన్వెన్షన్ సెంటర్ యజమాన్యానికి ముందస్తు నోటీసులు జారీ చేసి, వారి వాదనలు విన్న తరువాతనే ముందుకెళతారని, ఆ మేర తాను హామీ ఇస్తున్నానని, దానిని రికార్డ్ చేయాలని ఆయన కోర్టును కోరారు.

అసలు ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లోని నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అనుమతి లేదని, వాటిని కూల్చివేసే సమయంలో కూడా నోటీసులు జారీ చేస్తామని, చట్ట విరుద్ధంగా ఎటువంటి చర్యలు తీసుకోరని ఆయన పేర్కొన్నారు. ఈ దశలో పిటిషనర్లు హైకోర్టుకు రావడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి ఈ వ్యాజ్యాలపై బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తానని, అప్పటి వరకు యథాతథస్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా