ఫార్మాసిటీకి లభించని అనుమతి!

4 Feb, 2018 03:20 IST|Sakshi

     పర్యావరణ అనుమతిపై నిర్ణయాన్ని వాయిదా వేసిన కేంద్రం

     అదనపు సమాచారం కోరిన కేంద్ర పర్యావరణశాఖ

     కాలుష్య నిర్మూలనపై ప్రణాళికలు సమర్పించాలని సూచన

     తదుపరి సమావేశంలో మళ్లీ పరిశీలించే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల జారీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వాయిదా వేసింది. గత నెల 24న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావ రణ మార్పుల మంత్రిత్వశాఖ (ఎంఓఈఎఫ్‌) నేతృత్వంలోని ఎక్స్‌పర్ట్స్‌ అప్రైజల్‌ కమిటీ (ఈఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఫార్మాసిటీ ద్వారా పర్యావరణం, పరిసరాలు కలుషితం కాకుండా తీసుకునే చర్యలపై సమగ్ర ప్రణాళికలతో మరింత సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని కేంద్రానికి సమర్పిస్తే ఆ తదనంతరం జరిగే సమావేశంలో ప్రాజెక్టుకు అనుమతుల జారీపై ఈఏసీ నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే రూ. 64 వేల కోట్ల పెట్టుబ డులు వస్తాయని, ఏటా రూ. 1.4 లక్షల కోట్ల టర్నో వర్‌ నమోదవుతుందని, విదేశాలకు రూ. 58 వేల కోట్ల విలువగల ఔషధాలు ఎగుమతి అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్‌ మండలాల పరిధి లోని 19,333.20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 16,784 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఫార్మాసిటీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5.56 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెబుతోంది.

కమిటీ కోరిన వివరాలు ఏమిటంటే...
బల్క్‌ డ్రగ్స్, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంగ్రిడియెంట్స్‌ ఉత్పత్తి పరిశ్రమలు విడుదల చేసే రసాయన వ్యర్థాల శుద్ధి, నిర్వహణ కోసం తీసుకోబోయే చర్యలు
రసాయన వ్యర్థాలతో భూగర్భ జలాలు, భూ ఉపరితల జలాలు కలుషితం కాకుండా కామన్‌ ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు
ఫార్మాసిటీ పరిసరాల్లో ఇప్పటికే ఉన్న కుంటలు, చెరువులు, వాగులు కలుషితం కాకుండా తీసుకునే చర్యలు
ప్రమాదకర వ్యర్థాలన్నింటినీ ఫార్మాసిటీలోనే డిస్పోజ్‌ చేసేందుకు తీసుకోబోయే చర్యలు
ప్రాజెక్టు పరిసరాల్లోని గొనుగుమర్ల తండా, మర్రిపల్లి గ్రామాల ప్రజలు కాలుష్యం బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తలు
రసాయన ప్లాంట్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఉన్న సన్నద్ధత వివరాలు.

మరిన్ని వార్తలు