బాటిల్లో పెట్రోల్‌ కావాలంటే.. పేరు, ఫోన్‌ నంబర్, ఫొటో

5 Dec, 2019 08:26 IST|Sakshi
చిల్లర దుకాణం వద్ద అమ్మకానికి పెట్రోల్‌

బాటిళ్లలో ఆగని పెట్రోల్‌ అమ్మకాలు

కొన్ని బంకుల్లో ‘నో’ బోర్డులు.. అయినా అమ్మకాలు  

దుకాణాల్లో బాహాటంగా వ్యాపారం  

కనిపించని నియంత్రణ.. పట్టించుకోని అధికారగణం

సాక్షి,సిటీబ్యూరో: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ దుర్ఘటన అనంతరం, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు నిలిపివేయాలని ప్రభుత్వం అన్ని పెట్రోల్‌ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పట్టించుకోని వాటి యాజమాన్యాలు చిల్లర వ్యాపారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘దిశ’ సంఘనలోనూ బాటిల్‌ పెట్రోల్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఆదేశించినా నగరంలో ఇంకా బాటిళ్లలో పెట్రోల్‌ అమ్మకాలు యధేచ్ఛగా సాగుతునే ఉన్నాయి. అధికారులు బంకుల పైనా, చిల్లరగా అమ్మకాలు సాగిస్తున్న దుకాణాలపై దృష్టి పెట్టకుండా ఉదాసీనంగా ఉండడంతో బాటిల్‌ అమ్మకాలు మూడుపూవులు ఆరు కాయలుగా సాగుతున్నాయి.

ఇలాంటి వ్యాపారం పెట్రోల్‌ బంకులతో పాటు బాహాటంగా రోడ్డు పక్కన కూడా సాగుతున్నాయి. నగర శివార్లలో జరిగిన తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం, దిశపై అత్యాచారం, పెట్రోల్‌ పోసి తగలబెట్టడం, తహసీల్‌ ఆఫీసుల్లో పెట్రోల్‌ బాటిల్స్‌తో కలకలం వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం బాటిళ్లలో పెట్రోల్‌ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. గతంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినా అధికారుల తీరుతో ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో తాజాగా పోలీసు విభాగం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్, డీజిల్‌ పోస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. దీంతో పెట్రోల్‌ బంకుల్లో ‘నో పెట్రోల్‌ ఇన్‌ ప్లాస్టిక్‌ బాటిల్‌’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే, ఇది ఎంతవరకు పాటిస్తారోనన్న దానిపై బంకులపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది.

రోడ్డు పొడువునా బాటిళ్లతో అమ్మకాలు
హైదరాబాద్‌ నగరం నడిబొడ్డుతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం రోడ్డు పక్కన బహాటంగా పెట్రోల్‌ బాటిళ్లు పెట్టి విక్రయించడం సాధారణంగా మారింది. నగరంలో పెట్రోల్‌ బంకుల మధ్య గల దూరం ఆసరగా  ముఖ్య కూడళ్లోని వాహనాల మెకానిక్, గాలి నింపే దుకాణాల్లో పెట్రోల్‌ను బాటిళ్లలో విక్రయిస్తున్నారు. మరోవైపు శివారు ప్రాంతాల్లో సైతం టేబుళ్లపై బాటిళ్లలో పెట్రోల్‌ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా నియంత్రించాల్సిన సంబంధిత అధికారగణం ప్రేక్షక పాత్ర పోషించడం  విస్మయం కలిగిస్తోంది. 

పెట్రోల్‌ అయిపోతే..
ప్రయాణంలో ఉన్నప్పుడు పెట్రోల్‌ అయిపోయి దారిలో వాహనాలు నిలిచిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పటి ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఓ బాటిల్‌ తీసుకుని దగ్గరలోని బంకుకు వెళ్లి పెట్రోల్‌ తెచ్చుకునేవారు. ఇంకొందరు కుటుంబ సభ్యులకో, స్నేహితులకో ఫోన్‌ చేస్తే వారు బాటిళ్లలో పెట్రోల్‌ తెచ్చి ఇచ్చేవారు. ప్రస్తుత పోలీస్‌ నిబంధనల నేపథ్యంలో ఇకపై బాటిళ్లలో పెట్రోల్‌ తీసుకెళ్లడం కుదరదు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులకు అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు. పెట్రోల్‌ కోసం బాటిల్‌తో వచ్చినవారి వారి పేరు, ఫోన్‌ నంబర్, వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ వంటి వివరాలతో పాటు సదరు వ్యక్తుల ఫొటో సైతం స్మార్ట్‌ ఫోన్‌లో తీసుకుని పెట్రోల్‌ ఇవ్వొచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

బాటిళ్ల అమ్మకాలు చట్ట విరుద్ధం  
బహాటంగా బాటిళ్లలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు చేయడం నేరం. పెట్రోల్‌ బంకుల్లో సైతం బాటిళ్లలో అమ్మకాన్నినిషేధించాం. రోడ్డు పక్కన బాటిళ్లలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. – ఎంకే రాథోడ్, రంగారెడ్డి జిల్లాపౌర సరఫరాల అధికారి 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా