జాగా.. ఎక్కడా..!

30 Jun, 2019 14:34 IST|Sakshi

కాలేజీకి స్థలం కేటాయింపులో జాప్యం

మూలుగుతున్న రూ. 10కోట్ల నిధులు 

ఇబ్బందుల్లో విద్యార్థులు 

సాక్షి, నర్సాపూర్‌ : మండల కేంద్రమైన శివ్వంపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు సొంత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీచాలని ఉన్నత పాఠశాల భవనంలో ప్రస్తుతం కాలేజీ కొనసాగుతుండడంతో అందులో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఫీజు రాయితీ పథకాన్ని సైతం అమలు చేస్తున్నా మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల చేరిక పడిపోతుంది. 2008లో శివ్వంపేటకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరైంది.  ఎనిమిదేళ్లపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో కాలేజీ కొనసాగింది. ఆ భవనం సైతం శిథిలావస్థకు చేరడంతో  భవనాన్ని ఖాళీచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి  శివ్వంపేటలోని ఓ అద్దెభవనంలో కాలేజీ నిర్వహించారు. నెలవారి అద్దె చెల్లించకపోవడంతో ఆ భవనం సైతం ఖాళీ చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల భవనంలో..

ప్రస్తుతం కాలేజీని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతుంది. కేవలం నాలుగు గదులు మాత్రమే కేటాయించడంతో విద్యార్థులకు సరిపోని పరిస్థితి నెలకొంది.  సరిపడా గదులు లేకపోవడంతో పాటు విద్యార్థుల ప్రాక్టికల్స్‌ చేసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సొంత భవనం లేకపోవడంతోనే విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వెనుకడుగు వేస్తున్నారు. శివ్వంపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు అనుకూలంగా కాలేజీ ఉన్నా సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులను కళాశాలలో  బోధిస్తున్నారు. ద్వితీయ సంవత్సరంలో 55 మంది విద్యార్థులు ఉండగా మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు.

స్థానికంగా వసతులు లేకపోవడంతో విద్యార్థులు తూప్రాన్, నర్సాపూర్‌ ప్రాంతాల్లోని ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మండలంలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2018–2019 విద్యా సంవత్సరానికి సంబంధించి 544 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. శివ్వంపేట, చెండి, చిన్నగొట్టిముక్కల్ల, దొంతి గ్రామాలకు సంబంధించి ఇంటర్‌ చదివేందుకు శివ్వంపేట కాలేజీ అనుకూలంగా ఉంటుంది. ఆయా పాఠశాలల్లో 200 మంది విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులు మాత్రమే శివ్వంపేట ప్రభుత్వ కాలేజీలో పేర్లు నమోదు చేసుకున్నారు.

స్థలం లేక వృథాగా నిధులు..
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు సొంతభవనం నిర్మాణానికి 8 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం 40లక్షల నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు జరగకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. 6 సంవత్సరాల  క్రితం మరోమారు నాబార్డు నుంచి ఆధునిక జూనియర్‌ కళాశాల భవననిర్మాణానికి 10కోట్లు మంజూరయ్యాయి. నిధులు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ  భూమి కేటాయింపు చేపట్టకపోవడంతో ఆ నిధులు సైతం వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.

భవన నిర్మాణానికి భూమిని కేటాయిస్తే అన్ని హంగులతో విద్యార్థులకు పూర్తి వసతులతో భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. భూమి కేటాయించకపోవడంతో కాలేజీ భవన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కాలేజీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని పలుమార్లు అప్పటి మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలేజీ భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా