గ్రీన్‌ దిశగా జిల్లా..

12 May, 2020 12:04 IST|Sakshi

మూడు వారాలుగా నమోదు కాని కరోనా కేసు

ఏడుగురు డిశ్చార్జ్‌.. కోలుకుంటున్న మరొకరు

సరిహద్దు జిల్లాల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం

ఖమ్మంవైద్యవిభాగం: కరోనా కేసులు మూడు వారా లుగా నమోదు కాకపోవడం, ఎనిమిది పాజిటివ్‌ కేసుల్లో ఏడుగురు డిశ్చార్జ్‌ కావడం, మరొకరు కోలుకుంటుండడం ఇదంతా జిల్లా ప్రజలకు మంచి పరిణామంగా మారింది. గత నెలలో భయభ్రాంతులకు గురిచేసిన కరోనా మహమ్మారి ప్రస్తుతం ఉనికి కోల్పోయింది. దీంతో ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న జిల్లా గ్రీన్‌ జోన్‌గా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు ఏప్రిల్‌ 6న ఢిల్లీ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారితో కలిసొచ్చిన పెదతండా కు చెందిన వ్యక్తి ద్వారా నమోదైంది. అతడి ద్వారా మోతీనగర్‌కు చెందిన వ్యక్తికి, అలాగే ఖిల్లాలోని ఒకే కుటుంబంలో ఐదుగురికి వైరస్‌ సోకింది. బీకే బజార్‌కు చెందిన మహిళకు గత నెల 21న కరోనా పాజిటివ్‌ కేసు చివరిగా నమోదైంది. ఈమె ఖిల్లాలో కరోనా సోకిన ఇంట్లో పనిమనిషి. వారి ద్వారా ఆమె కు కరోనా వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.

కరోనా వార్డు ఖాళీ..
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. మొత్తం 120 పడకలతో వార్డు ఏర్పాటు చేయగా.. అందులో 15 పడకలు ఐసీ యూ, మరో 15 పడకలు ఐసోలేషన్‌ వార్డుకు కేటాయించారు. పెద్దాస్పత్రిలో సాధారణ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేసి అధికారులు, డాక్టర్లు, సిబ్బంది కరోనా రోగుల సేవల్లో నిమగ్నమయ్యారు. సుమారు 48 రోజులకు పైగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అహర్నిశలు శ్రమించారు. అనుమానిత వ్యక్తుల నుంచి శాంపిళ్లు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపించడం, పాజిటివ్‌ వస్తే వారిని గాంధీకి తరలించడం, నెగెటివ్‌ వచ్చిన వారిని శారద కళాశాలలోని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించడం వంటి చర్యలు చేపట్టారు.  సుమారు 100 మంది అధికారులు, సిబ్బంది షిఫ్టులవారీగా 2వేల మంది వరకు కరోనా, అనుమానిత లక్షణాలున్న రోగులకు వైద్య సేవలు అందించారు. అందులో 760 మంది నుంచి స్వాబ్‌ శాంపిళ్లను సేకరించగా.. 752 మందికి నెగెటివ్‌ రాగా.. 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. అయితే పది రోజులకు పైగా కరోనా వార్డు ఖాళీగా దర్శనమిస్తోంది. అనుమానిత రోగులు రాకపోవడంతో అధికారులు, వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకుంటున్నారు.

సరిహద్దు జిల్లాలతోనే ముప్పు..
ప్రస్తుతానికి కరోనా వైరస్‌ జిల్లాలో అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. జిల్లా నుంచి ఇంకా ఒక్కరు మాత్రమే రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాలతి తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాను గ్రీన్‌ జోన్‌గా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  అయితే.. ఈ దశలోనే మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తోంది. సరిహద్దు జిల్లాల నుంచి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఎక్కువ కేసులు ఉన్న కృష్ణా జిల్లా, సూర్యాపేట జిల్లా ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. నిత్యం పై జిల్లాల నుంచి ఖమ్మం జిల్లాకు రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. వీరి ద్వారా జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇకపై జిల్లా అధికారులు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండి.. రాకపోకలు సాగిస్తున్న వారిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాకు వచ్చే వారిని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు