రాష్ట్రంలో కరెంటు కోతలుండవు

23 May, 2015 03:05 IST|Sakshi
రాష్ట్రంలో కరెంటు కోతలుండవు

- ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు  
- మండుటెండల్లో నిరంతర విద్యుత్ సరఫరా
- రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు
 
హైదరాబాద్: 
మండుటెండలతో విలవిలలాడుతున్న రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవ ని, ఇకపై ఉండవని ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండు 135 మిలియన్ యూనిట్ల(ఎంయూ)కు చేరుకోగా, గరిష్టంగా 165 ఎంయూల డిమాండును తీర్చగల ‘శక్తి’ సామర్థ్యాలను కలిగి ఉన్నామన్నారు. రాష్ట్రంలో డిమాండు 165 ఎంయూలకు చేరినా నిరంతరాయంగా సరఫరా చేయగలమన్నారు.

ఎండలు పదునెక్కిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిగతులపై దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్‌పీడీసీఎల్) అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రభాకర్‌రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ పై విషయాలను తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని ఆయన తెలిపారు. వాతావరణంలో వేడి వల్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడంతోనే అక్కడక్కడ సరఫరాలో అంతరాయం వస్తోందన్నారు. తక్షణమే ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు నిర్వహించి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో సంతృప్తికర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు ట్రాన్స్‌కో, డిస్కంలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.

అన్ని సబ్‌స్టేషన్లు వినియోగంలోకి...
పెరుగుతున్న విద్యుత్ డిమాండును తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని 33/11 కేవీ సబ్ స్టేషన్లను తక్షణమే ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రభాకర్‌రావు డిస్కంలను ఆదేశించారు. జంట నగరాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తొలగించేందుకు ఎర్రగడ్డలోని 220/132 కేవీ సబ్ స్టేషన్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ట్రాన్స్‌కో అధికారులను కోరారు. మరమ్మతు అవసరాల కోసం అదనపు బృందాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

బదిలీల నిలుపుదల
ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సాధారణ బదిలీలను నిలిపివేయాలని ఎస్‌పీడీసీఎల్‌కు ప్రభాకర్‌రావు సూచించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు