వాటిపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు : రజత్‌ కుమార్‌

20 Oct, 2018 15:49 IST|Sakshi
ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఈవీఎం, వీవీపాట్‌లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, అన్ని సక్రమంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై రాజకీయ పార్టీల అనుమానాల నివృత్తికి 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. ఈవీఎంల పరిశీలనను వీడియో చిత్రీకరిస్తున్నామని, ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నామని తెలిపారు.

ఈవీఎంల రక్షణ బాధ్యత జిల్లా ఎన్నికల అధికారి, సహాయ అధికారులే చూసుకోవాలన్నారు. మీడియా, సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి ముందస్తు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని చెప్పారు. పలు జిల్లాల్లో ఇంకా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు ఎన్నికల అధికారులు ఈసీ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో ఈవీఎంల సమస్యలు పరిష్కరించటం లేదా కొత్త ఈవీఎంలను జిల్లాల్లో అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. వీవీపాట్‌లలో ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవటానికి అన్ని భాషల్లో కనిపించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఆదిలాబాద్‌లో 10 కోట్లు, హైదరాబాద్‌లో 49 లక్షలు, సైబరాబాద్‌లో 59 లక్షలతో పాటు పలు జిల్లాల్లో డబ్బులు దొరికింది నిజమేనని, దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్  క్షేత్రస్థాయిలో పర్యటించటం లేదని, అన్ని గుర్తింపు  పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. మేజర్ ఎలక్షన్ పనులు అయిపోయాయని, కేంద్ర ఎన్నికల సంఘం పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు