మా పదవులన్నీ ప్రజల భిక్షే

23 Mar, 2015 08:29 IST|Sakshi
 అభివృద్ధి చేయకుంటే ఓట్లకు రాను
  తెలంగాణలో నిధులకు కొదవలేదు
  ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల
 హుజూరాబాద్ :  ప్రజలు పెట్టిన భిక్షతోనే పదవులు అనుభవిస్తున్నామని, ఆ ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు కలిగిందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. స్థానిక నగరపంచాయతీ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైమాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎప్పుడుబడితే అప్పుడు ఓట్ల కోసం వారికి దండాలు పెట్టి, వారు వేసిన ఓట్లతో గెలవగానే మన పని పూర్తికాదని చెప్పారు. ఏ నమ్మకంతోనైతే వారు మనల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనపై ఉందని అన్నారు. తాను తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక, పౌరసర ఫరాల శాఖ మంత్రిగా కుర్చీలో కూర్చున్నానంటే కేవలం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల అభిమానమేనని అన్నారు. అందుకే గత 60 ఏళ్లుగా జరగని అభివృద్ధిని ఈ ఐదేళ్లలోనే చేసిచూపిస్తానని హామీ ఇచ్చారు. ఆర్డీవో కార్యాలయాన్ని మంజూరు చేయిస్తానని అన్నారు. అభివృద్ధి చేయకుంటే 2019లో ఓట్ల కోసం రానని మంత్రి తెలిపారు. గతంలో వలె అభివృద్ధి కోసం దండాలు పెట్టి దరఖాస్తులు ఇచ్చే పరిస్థితి కాదన్నారు. మన డబ్బులను మన సంక్షేమం కోసమే ఖర్చు చేసుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రంలో నిధులకు కొదవ లేదని వివరించారు. 
రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కోసం తాను సేవలందించాల్సి ఉన్నందున, నియోజకవర్గంలో ఉన్న చిన్నచిన్న సమస్యలను కూడా తన మెడకు చుట్టడం సమంజసం కాదన్నారు. వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నగరపంచాయతీ చైర్మన్లు తమ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. నిధుల విషయంలో తనను సంప్రదించాలని కోరారు. అధికార పార్టీలోనే ఉన్నామని, ఏంచేసినా చెల్లుతుందనే భావనను తొలగించుకోవాలన్నారు.ప్రతిపక్షాలు, విమర్శకుల అభిప్రాయాలను కూడా స్వీకరించి ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత, కౌన్సిలర్లు కల్లెపల్లి రమాదేవి, చెట్టి శ్రీనివాస్, బర్మావత్ యాదగిరి, ఎంపటి రాధిక, అపరాజ ముత్యంరాజు, ప్రతాప తిరుమల్‌రెడ్డి, మోటపోతుల పద్మ, చింత శ్రీనివాస్, కేసిరెడ్డి లావణ్య, గందె రాధిక, మంద ఉమాదేవి, కొయ్యడ కమలాకర్‌గౌడ్, పోరెడ్డి రజిత,  రాజేశ్వరి, ముక్క రమేశ్, సురేశ్, వెన్నంపల్లి కిషన్  పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు