వన్య ప్రాణికి కరువైన రక్షణ 

11 Aug, 2018 14:30 IST|Sakshi
నస్రుల్లాబాద్‌లోని కల్లు దుకాణంలో అమ్మేందుకు సంచుల్లో కుందేళ్లను తెచ్చిన వేటగాళ్లు(ఫైల్‌) 

వేటగాళ్ల ఉచ్చులో సాధు జంతువులు

కల్లు దుకాణాలే అడ్డాలుగా..

విచ్చల విడిగా అమ్మకాలు  చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

ఒకప్పుడు ఎటూ చూసిన అడవులే. అంతటా పచ్చిక బయళ్లే. వాటిలో స్వేచ్ఛగా సంచరించే జంతువులు కనువిందు చేసేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేటగాళ్లు సాధు జంతువులను వేటాడుతున్నారు. వల వేసి పడుతున్నారు. గ్రామాల్లోని ప్రధాన అడ్డాలైన కల్లు దుకాణాలు, అంగళ్లు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.

కొందరికైతే మరీ ముందస్తు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు మాత్రం చీమకుట్టు కూడా చలించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేటగాళ్ల బారి నుంచి సాదు జంతువులను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఇక వారు ఏ మేరకు స్పందిస్తారో..!

నస్రుల్లాబాద్‌(బాన్సువాడ): రోజు రోజుకు వన్య ప్రాణులకు రక్షణ లేకుండా పోతోంది. శాఖాహార జీవాలను వేటగాళ్లు వలలు వేసి మరీ పట్టుకుని కాల్చుకుతింటున్నారు. కాపాడాల్సిన వారు పట్టించుకోకపోవడంతో వారికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఇటీవలే మండలంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే.

దీంతో దానికి శస్త్ర చికిత్స చేసి రాజధాని జూకు తరలించారు. అయినా కూడా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అటువైపు అధికారులు మాత్రం కన్నెత్తి చూడడంలేదు.

ప్రతి నెల వచ్చే వేతనాలను తీసుకోవడంలో ఉన్న ఆతృత ఉద్యోగం చేయడంలో చూపించడంలేదని వన్య ప్రేమికులు వాపోతున్నారు. 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని బిచ్కుంద, గాంధారి, సిరికొండ, మాచారెడ్డి, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, నిజాంసాగర్, భీమ్‌గల్‌ తదితర మండలాల్లో గతంలో దట్టమైన అడవులు ఉండేవి.

అయితే అవి కాస్త ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో వేటగాళ్లు అటవీ జంతువులను వేడాడి వాటి మాంసాన్ని పాళ్లుగా వేస్తున్నారు. దీంతో వారికి ‘మూడు పాళ్లు.. ఆరు వేలు’గా ఆదాయం సమకూరుతోంది. వేటగాళ్లు ప్రధానంగా గ్రామాల్లోని కల్లు దుకాణాలు, వైన్సులను అడ్డాలుగా మార్చుకుని మరీ విక్రయిస్తున్నారు. 

కన్నెత్తి చూడని అటవీ అధికారులు.. 

‘ఒకవైపు వన్య ప్రాణులను కాపాడాలి’ అన్న నినాదంతో శాకాహార జంతువుల పెంపకం కోసం వన సంపద పెంచాలని ప్రభుత్వం హరితహారం నిర్వహించి మరీ మొక్కలను పెంచుతోంది. వేటగాళ్ల చేతులకు సాదు జీవులు బలై పోతున్నాయి. దీంతో రాబోయో రోజుల్లో సాదు జీవాలను జంతు ప్రదర్శన శాలలో మాత్రమే చూడాల్సి వస్తోంది. ఇలా ఇష్టారీతిన జంతువులను చంపుకు తింటూ ఉంటే మాత్రం రానురాను వన్య ప్రాణులు మాత్రం అంతరించి పోతున్నాయి.

ఐదేళ్ల క్రితం నస్రుల్లాబాద్‌ మండలంలోని అటవీ ప్రాంతంలో సంచరించే అటవీ జీవుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం 90 శాతం తగ్గిపోయింది. వర్ని–నస్రుల్లాబాద్‌ మధ్య ఉన్న గండిలో సాయంత్రం అయితే జన సంచారం ఉండేది కాదు. అయితే నేటి జనాలు క్రూర మృగాలుగా మారి కనుమరుగు చేస్తున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని పంట పొలాలు, పచ్చిక బయల్లు వంటి ప్రాంతాల్లో వలలు, ఉర్లు వంటివి పెట్టి యథేచ్ఛగా పెడుతున్నారు. 

ముందస్తు సమాచారంతోనే... 

పచ్చిక బయల్లు, అడవి ప్రాంతాల్లో పట్టిన శాఖాహార జంతువులు కుందేళ్లు, అడవి పంది, దుప్పి, కొండ గొర్రె, అడవి పక్షులు, కంజు పిట్టలు, పావురాలు వంటి వాటిని పట్టుకు వచ్చి సమీపంలోని కల్లు దుకాణాల్లో, అంగట్లో, బస్టాండ్‌ ప్రాంతంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీనికితోడు కొన్ని గ్రామాల్లో ముందస్తుగానే చెప్పి మరీ వేటకు వెళుతున్నారు.

పెద్ద మొత్తంలో మద్యం వ్యాపారం జరిగే గ్రామాల్లో కల్లు దుకాణాల్లో ప్రతి రోజు వివిధ రకాల వన్య ప్రాణులు లభిస్తాయని సమాచారం. ఇంతగా వన్యప్రాణులు విక్రయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వన్య ప్రాణులను కాపాడాలని వన ప్రేమికులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు