ఇక రబీయే దిక్కు!

7 Aug, 2017 01:54 IST|Sakshi
ఇక రబీయే దిక్కు!

► రాష్ట్రంలో దారుణంగా ఖరీఫ్‌ పంటల పరిస్థితి
► ముసురుకుంటున్న తీవ్ర కరువు పరిస్థితులు
►  ఇప్పటికే నెల రోజులుగా జాడలేని వర్షాలు
►  ముందస్తు రబీకి వెళ్లక తప్పదంటున్న వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు
►  రైతులను, ఖరీఫ్‌ పంటలను వదిలేసి  సమగ్ర సర్వేపైనే అధికారుల దృష్టి  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటల పరిస్థితి దారుణంగా మారింది. వర్షాలు సరిగా కురవక పంటలు ఎండిపోతున్నాయి. ఇలా కళ్లముందే పంటలు దెబ్బతింటుండడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పం టల పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా వ్యవసా యాధికారులు ఏమీ పట్టనట్టు ఉండిపోతు న్నారు. కేవలం సమగ్ర రైతు సర్వేపైనే దృష్టి సారిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు. ఖరీఫ్‌ పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ముందస్తు రబీకి వెళ్లాలని.. ఇప్పటికే పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు వర్షాలు కురిసే పరిస్థితి లేకపోవడంతో వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

దుర్భరంగా పరిస్థితి
జూలైలో 40% లోటు వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల దాదాపు నెల రోజులుగా వర్షాల జాడలేదు. దీంతో డ్రైస్పెల్‌ పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 జిల్లాల్లో లోటు నమోదైంది. మరో 18 జిల్లాల్లో సాధారణంగా, మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా 214 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయింది.

దీంతో ప్రస్తుతం సాగులో ఉన్న 82.8 లక్షల ఎకరాల ఖరీఫ్‌ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 44 లక్షల ఎకరాల్లో పత్తి పంట ఎండిపోయే దశలో ఉందని వ్యవ సాయ శాఖ అధికారులే చెబుతున్నారు. డ్రైస్పెల్‌ కారణంగా అనేక జిల్లాల్లో పత్తికి గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టింది.  43 రోజులకు మించియ వర్షాలు పడకపోతే∙తీవ్ర కరువు ప్రాంతాలుగా నిర్ధారి స్తారు. ఈ లెక్కన ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాగే మరో 10 రోజులు కొనసాగితే తీవ్ర కరువు ముంచెత్తనుంది.

పట్టించుకోని అధికారులు: అయితే, వ్యవసాయ శాఖలో ఏమాత్రం కదలిక కనిపించడం లేదు. ఖరీఫ్‌ పంటల వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు జిల్లాలకు వెళ్లాల్సిన ఆ శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్‌ దాటి కాలు బయటపెట్టడం లేదు. పైగా రైతు సమగ్ర సర్వే అంటూ గడిపేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఎవరికీ అందుబాటులో లేకుండా సమావేశాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. చివరికి మండల వ్యవసాయాధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉండటం లేదని.. రైతు సమగ్ర సర్వే వివరాల నమోదు పనిలోనే ఉంటున్నారని పేర్కొంటున్నారు.

ముందస్తు తప్పదా?
ఖరీఫ్‌ సాగు కష్టంలో పడడంతో వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యా మ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎండిపోయే దశలో ఉన్న పంటలపై 2 శాతం యూరియా స్ప్రే చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్‌ పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. పత్తి, వరి విషయంలో కొద్దిరోజులు వేచి చూడాలని.. నెలాఖరు వరకు కూడా వర్షాలు కురవక, పంటల పరిస్థితి కుదుటపడకుంటే ముందస్తు రబీకి వెళ్లడమే దిక్కు అని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా రబీ సాగు అక్టోబర్‌ నుంచి మొదలవుతుంది.

మరిన్ని వార్తలు