వాస్తవదూరంగా ‘ద్రవ్య’ బిల్లు

29 Nov, 2014 01:25 IST|Sakshi
వాస్తవదూరంగా ‘ద్రవ్య’ బిల్లు

* సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే బడ్జెట్ పెట్టారు  
* బిల్లుపై చర్చలో ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
* పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వికార సంస్కృతి
* ప్రభుత్వం తీరుపై అంతటా అసంతృప్తి ఉందని వ్యాఖ్య
* ఉత్తమ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ సభ్యుల అభ్యంతరం

 
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవదూరంగా ఉందని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో చూపిన గణాంకాలపై సాధ్యాసాధ్యాల ను లోతుగా పరిశీలించకుండానే గారడీ చేశారని విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్‌పైనా, ప్రభుత్వ వ్యవహారశైలిపై అన్నివర్గాల వారు అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్న ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ శాసనసభా పక్షంపూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఆయన తప్పుపట్టారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు.
 
 తన ప్రసంగంలో గత ప్రభుత్వాల్లో ఆదాయం, వృద్ధిరేటు మొదలుకొని ప్రస్తుత బడ్జెట్‌లో ప్రస్తావించిన లోటు భర్తీ, భూముల అమ్మకం, భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణం, రుణమాఫీ, గృహ నిర్మాణం, పరిశ్రమలు, విద్యుత్ వంటి అన్ని అంశాలను ప్రస్తావించారు. మొత్తం బడ్జెట్‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.21 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ 2012-13లో రూ.7,600కోట్లు, 2013-14లో రూ.8,991కోట్లు వచ్చిందని, ఈ లెక్కన ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి రూ.10 వేల కోట్ల వరకు అంచనా వేయొచ్చని, కానీ ప్రభుత్వం చెబుతున్న రూ.21 వేలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎలా సాధ్యమన్నారు.
 
 గత ప్రభుత్వ హయాంలో భూముల అమ్మకాలను చేపడితే వ్యతిరేకించిన టీఆర్‌ఎస్ ప్రస్తుతం భూములు అమ్మితే రూ.6,500 కోట్లువస్తాయని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కేవలం 4 నెలల కాల వ్యవధిలో భూములను గుర్తించి, టెండర్లు పిలిచి, వాటిని అమ్మి ఆదాయం సమకూర్చుతామనడం ఎలా సాధ్యమన్నారు. ఈ నాలుగు నెలల కాలంలో ప్రణాళిక వ్యయం కింద చూపిన రూ.48 వేల కోట్లలో సగానికి మించి ఖర్చు చేయడం సాధ్యమయ్యేలా లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత బడ్జెట్ లో కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఏమాత్రం సరిపోదని అన్నారు.  కరెంట్ కష్టాలకు కాంగ్రెస్ కారణం అనడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్ర వాటా 54 శాతం సాధ్యమైందని, ఎన్టీపీసీలో 4వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి, భూపాలపల్లి, సింగరేణిల ద్వారా మరో 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం దక్కిందన్నారు.
 
 ఆ రిజర్వేషన్లు సాధ్యమేనా?
 9.3శాతం ఉన్న గిరిజనులకు 12, అలాగే 11 శాతం జనాభా ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యేదేనా?. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని ఉత్తమ్ ప్రశ్నించారు.   గతంలో మంజూరై ప్రస్తుత నిర్మాణం కొనసాగుతున్న ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ కొట్లాడితే, కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ వికార సంస్కృతిని టీఆర్‌ఎస్ మానుకోవాలన్నారు.  అయితే, ఈ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.

>
మరిన్ని వార్తలు